
హమాస్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హమాస్ మిలిటెంట్ల రాకెట్ల దాడితో ఇజ్రాయిల్ ఉలిక్కి పడింది. దీంతో పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ కూడా వైమానిక దాడులకు దిగింది. ఈ భీకర దాడుల్లో ఇరువైపులా తీవ్ర నష్టం జరిగింది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఇప్పటివరకు దాదాపు 1000 మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. మరో మూడు, నాలుగు వేల మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
హమాస్ రాకెట్ల దాడితో తాము యుద్ధంలో ఉన్నామని ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఇప్పటికే ప్రకటించారు. ఈ నిర్ణయానికి తాజాగా అక్కడి సెక్యూరిటీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అవసరమైన సైనిక కార్యకలాపాలు కొనసాగించవచ్చని ఇజ్రాయిల్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇజ్రాయిల్‌పై మెరుపు దాడులకు దిగిన పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్.. ఒకేసారి ఐదు వేల రాకెట్లను గాజా నుంచి ప్రయోగించింది. దీంతోపాటు సాయుధులైన డజన్లకొద్దీ మిలిటెంట్లు సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లోకి అక్రమంగా ప్రవేశించారు. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పట్టణాల్లో తిరుగుతూ చాలామంది ఇజ్రాయిలీలను బందీలుగా చేసుకున్నారు. ఓవైపు వారిని విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతోపాటు గాజాపై ఇజ్రాయెల్ ప్రతిదాడులను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఇరువైపుల వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు.. ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధ పరిణామాలను భారత ప్రధానమంత్రి కార్యాలయం నిశితంగా గమనిస్తోందని కేంద్రమంత్రి మీనాక్షి లేఖి చెప్పారు. ఇజ్రాయిల్ దేశంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రధానమంత్రి, ఆయన కార్యాలయ సిబ్బంది అక్కడి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
ప్రస్తుతం భారత ప్రభుత్వం, ప్రధాన మంత్రి కార్యాలయం ఇజ్రాయిల్‌లో చిక్కుకున్న విద్యార్థులతో నేరుగా టచ్‌లో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటోందన్నారు. ఇజ్రాయిల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో అక్కడి భారత రాయబార కార్యాలయం ఇదివరకే అడ్వైజరీ జారీ చేసింది. భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇజ్రాయిల్ దేశం సూచించే సలహాలను పాటించాలని కోరింది.