PSLV C48 కౌంట్ డౌన్ షురూ

PSLV C48  కౌంట్ డౌన్ షురూ

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గెలుపు గుర్రం పీఎస్ఎల్ వీ రాకెట్ 50వ సారి నింగికి ఎగిరేందుకు సిద్ధమైంది. ఇస్రో రూపొందించిన రిశాట్–2బీఆర్1 ఉపగ్రహంతో పాటు మరో 9 విదేశీ శాటిలైట్లను అంతరిక్షానికి చేర్చేందుకోసం పీఎస్ఎల్ వీసీ 48 మిషన్ కు 23 గంటల కౌంట్ డౌన్ మంగళవారం సాయంత్రం 4.40 గంటలకు షురువైంది. ఏపీలోని శ్రీహరికోట సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్)లోని మొదటి లాంచ్ ప్యాడ్  నుంచి బుధవారం మధ్యాహ్నం 3.25 గంటలకు పీఎస్ఎల్ వీ సీ48 రాకెట్ నింగికి దూసుకెళ్లనుంది.

షార్ కు ఇజ్రాయెల్ స్టూడెంట్స్

పీఎస్ఎల్ వీ సీ48 రాకెట్ ద్వారా ఇస్రో ఇజ్రాయెల్ కు చెందిన డచిఫాట్ –3 శాటిలైట్ ను కూడా ప్రయోగించనుంది. అయితే, ఈ శాటిలైట్ ను తయారు చేసింది ముగ్గురు స్టూడెంట్లు కావడం విశేషం. ఆ ముగ్గురు స్టూడెంట్లు అలోన్ అబ్రమోవిచ్, మీతావ్ అసులిన్, ష్ముయేల్ అవివ్ లెవి సోమవారమే ఇజ్రాయెల్ నుంచి బయలుదేరారు. షార్ కు చేరుకుని నేడు జరిగే ప్రయోగాన్ని వీరు ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. వీరు ముగ్గురూ ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోని షార్ హానెగేవ్ హైస్కూల్ స్టూడెంట్లు. ఇజ్రాయెల్ స్టూడెంట్లు శాటిలైట్‌‌‌‌‌‌‌‌ను తయారు చేయడం ఇది మూడోసారి. అలాగే అమెరికాకు చెందిన4 మల్టీ మిషన్ లెమూర్ శాటిలైట్లు, తైవాక్ 0129, 1 హాప్ శాట్, ఇటలీకి చెందిన తైవాక్ -0092, జపాన్ శాటిలైట్ క్యూపీఎస్-ఎస్ఏఆర్‌‌‌‌‌‌‌‌నూ పీఎస్ఎల్ వీ సీ48 నింగికి చేర్చనుంది.

రిశాట్–2బీఆర్1.. బోర్డర్ లో నిఘా ‘నేత్రం’

రిశాట్–2బీఆర్1 శాటిలైట్ తో బోర్డర్ లో మన మిలటరీ నిఘా పవర్ మరింత పెరగనుంది. ఇది రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. రిశాట్ సిరీస్ లో నాలుగు లేదా ఐదు ఉపగ్రహాలను మోహరించాలని ఇస్రో భావిస్తోంది. మొదటి శాటిలైట్ రిశాట్ 2బీని మే 22న నింగికి చేర్చింది. రిశాట్-2బీఆర్1 రెండో ఉపగ్రహం. మూడో శాటిలైట్ రిశాట్ 2బీఆర్2ను కూడా త్వరలోనే ఇస్రో ప్రయోగించనుంది. రిశాట్ సిరీస్ లో కనీసం నాలుగు ఉపగ్రహాలను నింగికి పంపితే.. మన సరిహద్దుల్లో టెర్రరిస్టుల చొరబాట్లకు చెక్ పెట్టవచ్చని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు. సరిహద్దులోని ఏదైనా ఒకే ప్రాంతంపై 24 గంటలపాటూ నిరంతరం ఈ  ఉపగ్రహాలతో నిఘా ఉంచవచ్చనీ అంటున్నారు. ఈ ఉపగ్రహాల్లో ఇజ్రాయెల్ రాడార్ ‘టెక్సార్ 1’ సిస్టం ఆధారంగా తయారు చేసిన పవర్ ఫుల్ రాడార్ ను ఉపయోగిస్తున్నారు. ఇవి ఒకే సమయంలో 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో స్పష్టమైన ఫొటోలు తీయగలవు. కేవలం 0.35 మీటర్ల దూరంలో ఉన్న రెండు వేర్వేరు వస్తువులను కూడా ఇవి స్పష్టంగా గుర్తించగలవు.