
ఇంఫాల్: దేశ పౌరుల సేఫ్టీ, సెక్యూరిటీ కోసం10 శాటిలైట్లు నిరంతరం పనిచేస్తున్నాయని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చైర్మన్ నారాయణన్ వెల్లడించారు. మన దేశం మరింత దృఢమైన అంతరిక్ష శక్తిగా మారుతోందని.. 2040 నాటికి భారత్ కు మొదటి స్పెస్ స్టేషన్ కూడా ఉంటుందన్నారు. ఆదివారం మణిపూర్‌లోని ఇంఫాల్‌లో జరిగిన సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ సమావేశానికి నారాయణన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘భారత్ నుంచి ఇప్పటిదాకా 34 దేశాలకు చెందిన 433 శాటిలైట్లు ప్రయోగించం. అవన్నీ ఇప్పుడు కక్ష్యలోనే ఉన్నాయి. మన దేశ పౌరుల సేఫ్టీ, సెక్యూరిటీ కోసం కూడా 10 శాటిలైట్లు కక్ష్యలో ఉన్నాయి.
అవి నిరంతరం పని చేస్తున్నాయి’’ అని పేర్కొన్నారు. ఉపగ్రహాల ద్వారా మన దేశ భద్రతను మరింత పటిష్టం చేస్తున్నామన్నారు. శాటిలైట్లతో దేశానికి ఉన్న 7వేల కి.మీ సముద్ర తీరాన్ని నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరముందని చెప్పారు. ఉత్తర ప్రాంతాన్ని మొత్తం నిరంతరం నిశితంగా గమనించాలన్నారు. ఇది జరగాలంటే దేశ ఉపగ్రహ, డ్రోన్ టెక్నాలజీలో మరింత అభివృద్ధి సాధించాలన్నారు.