గ్రేట్ ఇండియా : మీ టెక్నాలజీ అమ్ముతారా : ఇస్రోకు నాసా ఆఫర్

గ్రేట్ ఇండియా : మీ టెక్నాలజీ అమ్ముతారా : ఇస్రోకు నాసా ఆఫర్

చంద్రయాన్‌-3 విజయం కావడంతో రాకెట్ల తయారీకి సంబంధించి మనదేశ సైంటిస్టులు వాడిన టెక్నాలజీని తమతో పంచుకోవాలని అమెరికా కోరినట్టు ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ వెల్లడించారు. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి రాకెట్ల తయారీ అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ అని , చంద్రయాన్‌-3 టెక్నాలజీ తెలుసుకునేందుకు అమెరికా నిపుణులు ఆసక్తి కనబర్చారని వివరించారు.

అమెరికాలో సంక్లిష్టమైన రాకెట్ మిషన్లను అభివృద్ధి చేయడంలో నిమగ్నమైన నిపుణులు తమతో అంతరిక్ష సాంకేతికతను పంచుకోవాలని భారత్‌ను కోరినట్లు సోమనాథ్ తెలిపారు. చంద్రయాన్-3 మిషన్ కోసం భారత అంతరిక్ష శాస్త్రవేత్తలు తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేసిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని చూసి నాసా శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారని, వాటిని కొనుగోలు చేస్తామంటూ ముందుకొచ్చారని చెప్పారు. 

చంద్రయాన్-3 మిషన్ ప్రయోగానికి ముందు 2023 ఆగస్టులో నాసా శాస్త్రవేత్తల బృందం ఇస్రో ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. చంద్రుని దక్షిణ ధృవానికి వెళ్లేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన సాంకేతికతను చూసి వారెంతో ఆశ్చర్యపోయారు.

మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం 92వ జయంతి సందర్భంగా శనివారం (అక్టోబర్ 14న) రామేశ్వరంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి సోమనాథ్​ ప్రసంగించారు. భారత టెక్నాలజీనిని అమెరికా అడిగిందని, దీనిని బట్టి రాకెట్‌ టెక్నాలజీలో భారత్‌ సాధించిన విజయాన్ని విద్యార్థులు అర్థం చేసుకోవాలని చెప్పారు.

రోజులు మారాయని, అత్యుత్తమ పరికరాలను రాకెట్లను నిర్మించగల సత్తా భారత్​ సొంతం చేసుకుందని చెప్పారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు ద్వారాలు తెరిచారని అన్నారు.