ప్రపంచం చూపంతా చంద్రయాన్‌‌ 2పైనే…

ప్రపంచం చూపంతా చంద్రయాన్‌‌ 2పైనే…

ఏ డేటా ఇస్తుందోనని నాసా కూడా ఎదురు చూస్తోంది
సెప్టెంబర్ 7న అర్ధరాత్రి 1.55 గంటలకు ల్యాండింగ్
మాంజినస్ సీ, సింపె లియస్ ఎన్​ లోయల మధ్య స్పాట్: ఇస్రో చైర్మన్​ శివన్​

ప్రపంచం మొత్తం చంద్రయాన్​ 2 ప్రయోగాన్ని నిశితంగా గమనిస్తోందని, దేశాల చూపంతా చంద్రయాన్​ 2 ల్యాండింగ్​పైనే ఉందని ఇస్రో  చైర్మన్​ కే శివన్​ అన్నారు. చైనా సహా ఏ దేశమూ వెళ్లలేని చందమామ దక్షిణ ధ్రువంపై దిగుతుండడమే అందుకు కారణమని ఆయన అన్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువంలో నీళ్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ‘‘సెప్టెంబర్​ 7 అర్ధరాత్రి దాటాక 1.40 గంటలకు ల్యాండింగ్​ ప్రక్రియ మొదలవుతుంది. 1.55 గంటలకు ల్యాండర్​ విక్రమ్​ చంద్రుడిపై దిగుతుంది. దక్షిణ ధ్రువం ఈక్వేటర్​కు 71 డిగ్రీలు, తూర్పుకు 38 డిగ్రీల దూరంలో ఉన్న మాంజినస్​ సీ, సింపెలియస్​ ఎన్​ అనే రెండు లోయల మధ్య విక్రమ్​ ల్యాండ్​ అవుతుంది. అక్కడ కొన్ని ముఖ్యమైన వివరాలను చంద్రయాన్​ 2 సేకరిస్తుంది. ఆ వివరాలు భవిష్యత్తులో ఇండియా చేయబోయే చంద్రుడి ప్రయోగాలకు, ఇతర దేశాలు కట్టాలనుకుంటున్న బేస్​ ప్రయోగాలకు ఉపయోగపడతాయి.

ఇప్పటికే దక్షిణ ధ్రువం వద్ద మనిషి మనుగడకు అవసరమయ్యే బేస్​ను కడతామని నాసా ప్రకటించింది. చంద్రయాన్​ 2 ఇచ్చే డేటా కోసమే నాసా ఎదురు చూస్తోంది” అని అన్నారు. విక్రమ్​ దిగాక నాలుగు గంటలకు రోవర్​ ప్రజ్ఞాన్​ బయటకు వస్తుందని చెప్పారు. సెకనుకు ఒక సెంటీమీటర్​ స్పీడ్​ చొప్పున అది వెళుతుందని అన్నారు. ఆ తర్వాత గంటన్నరకు చంద్రుడి ఫొటోలను ప్రజ్ఞాన్​ భూమ్మీదికి పంపుతుందన్నారు. అయితే, రోవర్​కు అటానమస్​ వ్యవస్థలు లేకపోవడం వల్ల ల్యాండర్​ లేదా ఆర్బిటర్​ సహకారంతో ఆ ఫొటోలను పంపుతుందని వివరించారు. రోవర్​ పంపిన ఫొటోలను పరిశీలించిన తర్వాత జనానికి అందుబాటులో ఉంచుతామని, నాసా కూడా ఆ డేటాను వాడుకోవచ్చని చెప్పారు. చంద్రయాన్​ సహా రెండు సార్లు ఇండియా ఉపగ్రహం చంద్రుడి కక్ష్యలోకి వెళ్లిందన్నారు. చంద్రయాన్​ 3 ప్రయోగాన్ని కూడా చేస్తామని తెలిపారు. ఆడ, మగ అన్న తేడాను ఇస్రో ఎప్పుడూ చూడదని, టాలెంట్​ను మాత్రమే ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. వాళ్లకే గుర్తింపు, అవకాశాలు వస్తాయన్నారు.

శివన్​కు ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు

ఇస్రో చైర్మన్​ను తమిళనాడు ప్రభుత్వం డాక్టర్​ ఏపీజే అబ్దుల్​ కలాం అవార్డుతో గౌరవించింది. సైన్స్​ అండ్​ టెక్నాలజీ ప్రమోషన్​లో ఎనలేని సేవలందిస్తున్న ఆయనకు అవార్డును ఇస్తున్నట్టు ఇంతకుముందే ఆ రాష్ట్ర సర్కారు ప్రకటించింది. నిజానికి పంద్రాగస్టు నాడే అవార్డు తీసుకోవాల్సి ఉన్నా, కొన్ని కారణాలతో అది వాయిదా పడింది. తాజాగా గురువారం తమిళనాడు సెక్రటేరియట్​లో ముఖ్యమంత్రి కే పళనిస్వామి ఆయనకు అవార్డును అందజేశారు. అవార్డులో భాగంగా 8 గ్రాముల బంగారు పతకం, ₹5 లక్షల నజరానా ఆయనకు అందనుంది. దాంతో పాటు ఓ ప్రశంసా పత్రమూ ఆయనకు ఇచ్చారు. చంద్రయాన్​ 2 మిషన్​ ఆయన నేతృత్వంలోనే జరిగిందన్న సంగతి తెలిసిందే. దాంతో పాటు ‘సితార’ అనే 6డీ ట్రాజెక్టరీ సిములేషన్​ (కక్ష్య అనుకరణ) సాఫ్ట్​వేర్​నూ ఆయనే తయారు చేశారు.