మరో ప్రయోగానికి ఇస్రో రెడీ..జులై 30న PSLV C–56 రాకెట్ .. నింగిలోకి 7 ఉపగ్రహాలు

మరో  ప్రయోగానికి ఇస్రో రెడీ..జులై 30న   PSLV C–56 రాకెట్  .. నింగిలోకి 7 ఉపగ్రహాలు

 శ్రీహరికోటలోని మొదటి లాంచ్ పాడ్ ఈ రాకెట్ ప్రయోగానికి వేదికగా నిలవనుంది. పీఎస్ఎల్వీ సి-56 రాకెట్ ద్వారా ప్రధానంగా సింగపూర్ డీఎస్ టీఏ-ఎస్టీ ఇంజినీరింగ్ సంస్థకు చెందిన డీఎస్-ఎస్ఏఆర్ ఉపగ్రహాన్ని రోదసిలోకి మోసుకెళ్లనుంది.

చంద్రయాన్-3ను ఇటీవలే విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన భారత అంతరిక్షణ పరిశోధ సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 30వ తేదీ ఆదివారం రోజున పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగాన్ని చేపట్టేందుకు ఇస్రో అన్ని సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ నెల 30వ తేదీ ఆదివారం రోజున ఉదయం 6.30 గంటలకు ఈ ప్రయోగం చేపట్టనుంది. 

పీఎస్ఎల్వీ- సీ56 మిషన్.. పీఎస్ఎల్వీ- సీ55 మాదిరిగానే కోర్-ఎలోన్ మోడ్ లో కాన్ఫిగర్ చేశారు. DS-SAR ఉపగ్రహాన్ని ప్రాథమిక పేలోడ్ గా పీఎస్ఎల్వీ- సీ56 తీసుకెళ్లనుంది. సింగపూర్ డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ, ST ఇంజినీరింగ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ 360 కిలోల DS-SAR ఉపగ్రహాన్ని 5 డిగ్రీల వంపులో... 535 కిలోమీటర్ల ఎత్తులో నియర్-ఈక్వటోరియల్ ఆర్బిట్(NEO) లోకి ప్రవేశపెట్టనుంది. DS-SAR ఉపగ్రహం ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్(IAI) అభివృద్ధి చేసిన సింథటిక్ అపెర్చర్ రాడారా   పేలోడ్ తో అమర్చారు. ఈ అధునాతన సాంకేతికత ద్వారా DS-SAR అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ పగలైనా, రాత్రయినా కవరేజీని అందించే సామర్థ్యం కలిగి ఉంటుంది. పూర్తి స్థాయి పొలారిమెట్రీ వద్ద 1m-రిజల్యూషన్ తో ఇమేజింగ్ ఇవ్వగలగుతుంది. ఈ ఉపగ్రహం తన కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత సింగపూర్ ప్రభుత్వంలోని వివిధ ఏజెన్సీల ఉపగ్రహ చిత్రాల అవసరాలకు DS-SAR తన సపోర్ట్ ను అందిస్తుంది. అలాగే ST ఇంజినీరింగ్ వారి వాణిజ్య వినియోగదారుల కోసం మల్టీ-మోడల్, హైయ్యర్ రెస్పాన్సివ్‌నెస్‌ చిత్రాల కోసం జియోస్పేషియల్ సేవల కోసం ఈ ఉపగ్రహాన్ని వాడుకోనున్నారు. 

DS-SARతో పాటు మరో 6 ఉపగ్రహాలు

DS-SAR శాటిలైట్ తో పాటు మరో ఆరు ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నట్లు ఇస్రో ప్రకటించింది. టెక్నాలజీ డెమాన్ స్ట్రేషన్ మైక్రో శాటిలైట్ వెలాక్స్-AM, ఎక్స్‌పెరిమెంటల్ శాటిలైట్ ARCADE, 3U నానోశాటిలైట్ స్కూబ్-2, IoT కనెక్టివిటీ నానోశాటిలైట్ నూలయన్, గెలాసియా-2, ORB-12 స్ట్రైడర్ శాటిలైట్లను కూడా రోదసిలోకి పంపనుంది ఇస్రో.