నాసాకు దీటుగా ఇస్రో : మార్చి 21న నింగిలోకి 30 కమర్షియల్ శాటిలైట్లు

నాసాకు దీటుగా ఇస్రో : మార్చి 21న నింగిలోకి 30 కమర్షియల్ శాటిలైట్లు

నెల్లూరు జిల్లా:  అంతరిక్ష పరిశోధనలలో దూసుకుపోతున్న అమెరికా స్పేస్ రీసెర్చ్ సంస్థ నాసా ఆధిపత్యానికి చెక్ పెట్టేలా ఇండియా దిగ్గజం ఇస్రో సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యింది. ఈ నెలలో సరికొత్త PSLV రాకెట్  నింగిలోకి పంపుతోంది. ఈ రాకెట్ లో దాదాపు 30 థర్డ్ పార్టీ (కమర్షియల్) శాటిలైట్లు నింగిలోకి దూసుకెళ్లనున్నాయి. ఈ కొత్త వేరియంట్ PSLV రాకెట్ ను మార్చి 21న ప్రయోగిస్తోంది ఇస్రో.

ఇస్రోకు ఇది చాలా స్పెషల్ మిషన్. నాలుగు స్ట్రాప్-ఆన్ మోటర్లతో PSLV రాకెట్ ను ప్రయోగించనున్నారు. మొదటిసారి 3 వేర్వేరు ఎత్తుల వద్ద రాకెట్ ను కక్ష్యలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇస్రో అధికారులు చెబుతున్నారు.

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)కు సంబంధించిన డిఫెన్స్ ఇంటిలిజెన్స్ శాటిలైట్ ఎమిశాట్ ను PSLV రాకెట్ తో పంపుతున్నారు. ఈ ఒక్క శాటిలైట్ బరువే సుమారు 420 కిలోలు. ఇతర దేశాలకు సంబందించిన 28 కమర్షియల్ శాటిలైట్లు 250 కిలోల బరువున్నాయి.

మరోవైపు ఇస్రో కొత్త రాకెట్ SSLV తో ఈ ఏడాది జులై లేదా ఆగస్టులో మరో రెండు రక్షణ శాఖ శాటిలైట్లను కూడా లాంచ్ చేయనుంది. గత జనవరి లో, స్పేస్ ఏజెన్సీ DRDO కోసం డిఫెన్స్ ఇమేజింగ్ శాటిలైట్ మైక్రోసాట్ R ను ప్రారంభించింది.

మార్చి 21న PSLV శాటిలైట్… డీఆర్డీఓ ఎమిశాట్ ను అంతరిక్షంలోకి విడిచిన తర్వాత…. అలాగే మరో 76 కిలోమీటర్లు వరకు ప్రయాణించి.. 28 శాటిలైట్లను 504 కిలోమీటర్ల ఎత్తులో కక్షలో ప్రవేశపెట్టనుంది. PSLV రాకెట్… సాలిడ్ మరియు లిక్విడ్ ఇంధనంతో… ఫోర్ స్టేజ్ ఇంజిన్ ను కలిగి ఉంది. గత జనవరి 24న ISRO రెండు PSLV లను రెండు స్ట్రాప్-ఆన్ మోటర్లతో నడిపింది. అయితే ఈ నెలలో నాలుగు స్ట్రాప్-ఆన్ మోటర్స్ తో ప్రయోగం చేస్తోంది ఇస్రో.