కేయూ పీహెచ్​డీ ప్రవేశాల్లో గందరగోళం

కేయూ పీహెచ్​డీ ప్రవేశాల్లో గందరగోళం
  • ఫుల్​టైం స్కాలర్స్​కే ఇచ్చేలా మొదట నోటిఫికేషన్
  • స్క్రూటినీ పూర్తయ్యాక పార్ట్​టైం అభ్యర్థులకూ అవకాశం ఇచ్చేలా సవరణ
  • ఈసీ ఆమోదం లేకుండానే నిర్ణయాలు
  • కావాల్సినవాళ్లకు అడ్మిషన్లు ఇచ్చేందుకేననే ఆరోపణలు

హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఐదేండ్ల తరువాత చేపట్టిన పీహెచ్​డీ ప్రవేశాల్లో గందరగోళం నెలకొంది. యూజీసీ రూల్స్​ను పక్కాగా అమలు చేయాల్సిన ఆఫీసర్లు ఇష్టారీతిన రూల్స్​మార్చి అడ్మిషన్లు ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేటగిరీ వన్​ ఖాళీల భర్తీలో పార్ట్​టైమ్​అభ్యర్థులకు అవకాశం లేకుండా, ఫుల్​ టైమ్ స్కాలర్స్​ మాత్రమే అర్హులని నోటిఫికేషన్​ విడుదల చేసిన ఆఫీసర్లు.. ఇంటర్వ్యూల చివరి రోజున దానిని సవరించారు. వాస్తవానికి నోటిఫికేషన్​ రూల్స్​ సవరించాలంటే డీన్స్​ కమిటీ  సిఫారసులను స్టాండింగ్​ కమిటీతో పాటు ఎగ్జిక్యూటివ్​ కౌన్సిల్​ఆమోదించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఈసీ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఏకపక్ష నిర్ణయాలతో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రూల్స్ మార్చేసిన్రు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 2017లో చివరిసారిగా పీహెచ్​డీ నోటిఫికేషన్​ విడుదలైంది. విద్యార్థి సంఘాల ఆందోళనలు, అభ్యర్థనల నేపథ్యంలో వర్సిటీ దిగివచ్చి మరోసారి పీహెచ్​డీ ప్రవేశాలకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. కేయూలో మొత్తం 424 పీహెచ్​డీ అడ్మిషన్లకు కేటగిరీ వన్​ కింద 212 స్థానాలకు గతేడాది డిసెంబర్​20న నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. అందులో అభ్యర్థులు తప్పనిసరిగా జేఆర్ఎఫ్, యూజీసీ నెట్, గేట్, సెట్, ఎంఫిల్​అర్హత కలిగి ఉండాలని పేర్కొంది. అభ్యర్థుల నుంచి ఈ ఏడాది జనవరి 20 వరకు ఆన్​లైన్​అప్లికేషన్లు స్వీకరించింది. దాదాపు  4 వేల వరకు దరఖాస్తులు రాగా.. అడ్మిషన్స్​ కమిటీ అప్లికేషన్ల స్ర్కూటినీ ప్రారంభించింది. రూల్స్​కు అనుగుణంగా మెరిట్​ లిస్ట్​ రూపొందించి ఇంటర్వ్యూ తేదీలను ప్రకటించింది. మే 20 నుంచి 28 వరకు వివిధ డిపార్ట్​మెంట్ల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. మే 28న ఫైనల్​ మెరిట్​ ప్రకటించి అడ్మిషన్ల జాబితా విడుదల చేయాల్సి ఉంది. కానీ అదే రోజు డీన్స్​ కమిటీ రిసొల్యూషన్​ పేరుతో నోటిఫికేషన్​ను మోడిఫై చేసింది. రూల్స్​లో మార్పులు ఏమైనా ఉంటే అప్లికేషన్లు గడువు చివరి తేదీలోగా చేయాలి. కానీ అడ్మిషన్ ​ప్రక్రియ చివర్లో రూల్స్​సవరించడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీలో అకడమిక్​కు సంబంధించి ప్రతి విషయాన్ని పబ్లిక్​ డొమైన్​లో పొందుపరచాల్సి ఉంది. కానీ వర్సిటీ ఆఫీసర్లు మాత్రం ఈ విషయంలో పారదర్శకతను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. 

నిరాశలో ఫుల్​టైం అభ్యర్థులు

యూజీసీ రూల్స్​ ప్రకారం కేటగిరీ వన్​ పీహెచ్​డీ అడ్మిషన్లకు కేవలం ఫుల్​టైం రీసెర్చ్​స్కాలర్స్ మాత్రమే అర్హులని, పార్ట్ టైం అభ్యర్థులకు అవకాశం లేదని నోటిఫికేషన్​లో పొందుపరిచారు. మొదట్నుంచీ పార్ట్​ టైం అభ్యర్థులకు అవకాశం లేదని చెప్పి.. చివరకు పార్ట్​ టైం అభ్యర్థులకే 25 శాతం సీట్లు కేటాయించారు. ఇందులో ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీల్లో పని చేసే లెక్చరర్లు, ప్రొఫెసర్లను తీసుకునేలా రూల్స్​సవరించారు. ఇలా పార్ట్​ టైం రీసెర్చ్​స్కాలర్స్​కు అవకాశం ఇవ్వడంతో అన్ని అర్హతలు ఉన్న ఫుల్​ టైం పీహెచ్​డీ అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. మొత్తంగా 50కిపైగా పీహెచ్​డీ సీట్లు పుల్​ టైమ్​అభ్యర్థులు కోల్పోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే వివిధ సంస్థల్లో పని చేసే అభ్యర్థులు ఇంటర్వ్యూకు ముందే సంస్థ నుంచి ఎన్​వోసీలు సమర్పించాల్సి ఉంది. అయితే దాదాపు 20 శాతం అభ్యర్థులు ఎన్​వోసీ ఇవ్వకున్నా వారికి ఇంటర్వ్యూలు పూర్తి చేసి, ఎన్​వోసీ సమర్పణకు గడువు పొడగించడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

కమిటీల ఆమోదం లేకుండానే..

అడ్మిషన్ల రూల్స్​మొదలుకొని, పూర్తి ప్రక్రియకు స్టాండింగ్​కమిటీ, ఎగ్జిక్యూటివ్​ కౌన్సిల్​ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. కానీ పీహెచ్​డీ అడ్మిషన్ల ప్రక్రియ ఈ రెండు కమిటీల ఆమోదం లేకుండానే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని ఈసీ మెంబర్స్ ఈ నెల 13న జరిగిన మీటింగ్​లో ప్రశ్నించారు. దీంతో వీసీతోపాటు ఇతర ఉన్నతాధికారులు మీటింగ్ మధ్యలోంచే వెళ్లిపోవడం గమనార్హం. దగ్గరివాళ్లకు సీట్లు కేటాయించేందుకు ఆఫీసర్లు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  పీహెచ్​డీ ప్రవేశాల్లో గందరగోళం నేపథ్యంలో వర్సిటీ విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేయూ ఆఫీసర్ల తీరుతో తమ భవిష్యత్తు ఆగమవుతోందని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఆందోళనకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.

ఏదో మతలబుంది

ఇంటర్వ్యూలు పూర్తయిన తరువాత రూల్స్​మార్చడం వెనుక ఏదో మతలబు ఉంది. అడ్మిషన్​ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక రూల్స్​మార్చారు. వారికి సంబంధించిన వాళ్లకు అడ్మిషన్లు ఇవ్వడానికే 25 శాతం సీట్లు పార్ట్​ టైం రీసెర్చ్​ స్కాలర్స్​కు కేటాయించారు. అధికారుల తీరు అనుమానాలకు తావిస్తోంది. సీట్లు కోల్పోయిన అభ్యర్థులకు న్యాయం జరిగేలా వర్సిటీ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలి. 

- మాచర్ల రాంబాబు, పీహెచ్​డీ ఆస్పిరెంట్​

ఇష్టమొచ్చినట్లు సవరించిన్రు

పీహెచ్​డీ ప్రవేశాల్లో కేయూ ఆఫీసర్లు యూజీసీ రూల్స్​కు విరుద్ధంగా వ్యవహరించారు. ఇష్టమొచ్చినట్లు రూల్స్ సవరించి  పీహెచ్​డీ అడ్మిషన్లు ఇచ్చారు. సంవత్సరాల తరబడి పీహెచ్​డీ అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తే చివరికి వర్సిటీ ఆఫీసర్ల నిర్ణయాలతో ఎంతోమంది అడ్మిషన్లు పొందలేకపోయాం.

- అంబాల కిరణ్, పీహెచ్​డీ ఆస్పిరెంట్​

డీన్స్​ కమిటీ నిర్ణయం మేరకే..

పీహెచ్​డీ అడ్మిషన్ల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేదు. చివరి రోజున డీన్స్​కమిటీ నిర్ణయం మేరకే రూల్స్​మారుస్తూ కేటగిరీ వన్​అడ్మిషన్లలో 25 శాతం పార్ట్​ టైం రీసెర్చ్​స్కాలర్లకు అవకాశం కల్పించాం.  వర్సిటీలో అభ్యర్థులకు సరిపడా ప్రొఫెసర్లు లేరు. ప్రభుత్వ డిగ్రీ, పీజీ ప్రొఫెసర్ల ను పార్ట్​టైం పీహెచ్​డీ రీసెర్చ్​ స్కాలర్లుగా తీసుకోవడం వల్ల మిగతా అభ్యర్థులకు  కూడా ఉపయోగం ఉంటుందనే ఆలోచనతోనే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం.

- ప్రొఫెసర్​ బి.వెంకట్రామిరెడ్డి, 
కేయూ రిజిస్ట్రార్​