వర్క్ ఫ్రమ్ హోమ్ సూచనలు బేఖాతర్.. ఐటీ కారిడార్ లో తప్పని ట్రాఫిక్ తిప్పలు

వర్క్ ఫ్రమ్ హోమ్ సూచనలు బేఖాతర్.. ఐటీ కారిడార్ లో తప్పని ట్రాఫిక్ తిప్పలు

మాదాపూర్​/చందానగర్​, వెలుగు: సిటీలో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కురిసిన మోస్తరు వర్షంతో ఐటీ కారిడార్​లో ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా పెరిగింది. ఇటీవల రోడ్లు దెబ్బతినడం, డ్రైనేజీలు పొంగిపొర్లడంతో సమస్య మరింత జటిలమైంది. భారీ వర్షాల నేపథ్యంలో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్​ఫ్రమ్ హోం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించినప్పటికీ.. పలు కంపెనీలు పట్టించుకోలేదు. తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించుకోవడంతో ట్రాఫిక్ జామ్ నెలకొంది. 

సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ గజారావు భూపాల్, పోలీసు అధికారులు సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించారు. మాదాపూర్ నెక్టార్ గార్డెన్ వద్ద వరద నీరు దుర్గం చెరువులో కలిసే పైప్​లైన్‌‌‌‌ను మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీతో కలిసి పరిశీలించారు. రాయదుర్గం మల్కం చెరువు ఎదురుగా వాటర్ లాగింగ్ పాయింట్‌‌‌‌ను కూడా సందర్శించి, వర్షపు నీరు రోడ్లపై నిలవకుండా, ట్రాఫిక్ రద్దీ లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 

ఐటీ కంపెనీలకు ట్రాఫిక్ అడ్వైజరీ

సైబరాబాద్​లో గురువారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గజారావు భూపాల్ ఐటీ కంపెనీలకు అడ్వైజరీ జారీ చేశారు. ఐటీ కారిడార్​లో ట్రాఫిక్ రద్దీ, ఉద్యోగుల భద్రత, అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు, ఆగస్టు 14న ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అమలు చేయాలని సూచించారు. దీనివల్ల రోడ్లపై వాహనాల రద్దీ, ప్రమాదాలు తగ్గుతాయని పేర్కొన్నారు.

వెహికల్స్ బ్రేక్ డౌన్

వర్షానికి తోడు పలు ప్రాంతాల్లో వెహికల్స్​ బ్రేక్​డౌన్ అయ్యాయి. మజీద్​బండ నుంచి బొటానికల్​గార్డెన్​వైపు వెళ్లే దారిలో శ్రీరాంనగర్​వద్ద వాటర్​ట్యాంకర్​ఆగిపోయింది. సైబర్​టవర్​నుంచి బయోడైవర్సిటీ పార్కు వైపు వెళ్లే రూట్​లో ఐకియా అండర్​పాస్​వద్ద ఓ వాహనం బ్రేక్ డౌన్​అయ్యింది. నల్లగండ్ల ఫ్లైఓవర్​నుంచి నల్లగండ్ల చౌరస్తా వెళ్లే రోడ్డులో ఓ స్కూల్​ బస్సు మధ్యలో నిలిచిపోయింది. గచ్చిబౌలి జంక్షన్​వెళ్లే రోడ్డులో ఐఐఐటీ జంక్షన్​వద్ద లారీ బ్రేక్​డౌన్​అయ్యింది. ఈ కారణంగా ఆయా రూట్లలో ట్రాఫిక్​ జామ్​ఏర్పడింది.