ఐటీ ఉద్యోగులు ఈసారైనా ఓటేస్తరా?

ఐటీ ఉద్యోగులు ఈసారైనా ఓటేస్తరా?
  • గత ఎన్నికల్లో నూ 50% దాటలే
  • కరోనా ఎఫెక్ట్ తో ఊళ్లకు వెళ్లిన ఉద్యోగులు
  • పోలింగ్ నాటికైనా వచ్చేరా..

హైదరాబాద్, వెలుగుఎన్నికలు ఏవైనా చాలామంది ఐటీ ఉద్యోగులు ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఐటీ కారిడార్లలో ఓటింగ్ శాతం ఎప్పుడూ తక్కువగానే నమోదవుతోంది. ఈసారి గ్రేటర్ ఎన్నికల్లోనైనా వీళ్లంతా ఓట్లు వేస్తారా? మళ్లీ ఎప్పటిలాగే పోలింగ్ కు దూరంగా ఉంటారా అన్నది సమజ్ అయితలేదు. చదువుకొని, సొసైటీలో మిగతావారిని ఇన్ స్పైర్ చేయాల్సిన ఐటీ ఉద్యోగులనే ఓట్లు వెయ్యండి బాబు అంటూ ప్రభుత్వాధికారులే మోటివేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్ లలో గ్రేటర్ లో 50 శాతం కూడా పోలింగ్ కాలేదు. ముఖ్యంగా సాఫ్ట్​వేర్​ఎంప్లాయీస్​ఉండే ప్రాంతాల్లో పోలింగ్​35 నుంచి 45 శాతం మాత్రమే నమోదవుతోంది.

అడ్రస్ ఫ్రూఫ్ గానే ఓటర్ ఐడీ

జాబ్ కోసం సిటీకి వచ్చిన చాలామంది ఓటర్ ఐడీ పొందారు. దాన్ని అడ్రస్ ఫ్రూఫ్ గా తప్ప ఓటు వేసేందుకు వాడటం లేదు. దీంతో ఐటీ ఎంప్లాయీస్ ఉన్నచోట ఓటర్ల సంఖ్య ఎక్కువ.. పోలింగ్ శాతం తక్కువ అన్నట్లుగా ఉంటోంది. సిటీలో దాదాపు  6 లక్షల మందికి పైగానే ఐటీ ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 1.5 లక్షల మంది ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన వారైతే, మిగతా మూడున్నర లక్షల మంది  రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు చెందినవారు. లక్ష మంది వరకు సిటీవాసులు ఉంటారు. గ్రేటర్ లో ఎక్కువగా గచ్చిబౌలి, హఫీజ్ పేట్, మాదాపూర్, పటాన్ చెరు, మియాపూర్, కూకట్ పల్లి, బాలాజీ నగర్, చందా నగర్, షేక్ పేట్, యూసుఫ్ గూడ, సనత్ నగర్, అమీర్ పేట్ తోపాటు ఉప్పల్, రామాంతాపూర్, శేరిలింగంపల్లి డివిజన్ల పరిసర ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు.

ఓట్లు ఎక్కువ.. పోలింగ్ తక్కువ

గ్రేటర్​లోని కొన్ని డివిజన్లలో మొత్తం ఓటర్లలో 12 నుంచి 16 శాతం వరకు ఐటీ ఉద్యోగులు ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ పోలింగ్​మాత్రం తక్కువగా నమోదవుతోంది. శేరిలింగంపల్లి, చందానగర్, గచ్చిబౌలి, పటాన్ చెరు డివిజన్ల పరిధిలో ఎక్కువగా గేటెడ్ కమ్యూనిటీలు ఉంటాయి. శేరిలింగంపల్లిలో మొత్తం 65 వేల మంది ఓటర్లు ఉంటే, ఇందులో దాదాపు పది వేల మంది వరకు ఐటీ, ఐటీ అనుబంధ రంగాలకు చెందినవారే. కానీ ఈ డివిజన్ లో గత ఎన్నికల్లో నమోదైన పోలింగ్​శాతం 43 మాత్రమే. గచ్చిబౌలిలో 50 వేల ఓటర్లు ఉండగా ఇందులో ఆరున్నర వేలమంది ఐటీ ఉద్యోగులే. ఈ డివిజన్​లో గత ఎన్నికల్లో 20 వేల ఓట్లు కూడా పోలవ్వలేదు. చాలా డివిజన్లలో ఇదే పరిస్థితి ఉంది. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే డివిజన్లలో ఒక్క కేపీహెచ్​బీలో మాత్రమే గత ఎన్నికల్లో 50% ఓట్లు పోలయ్యాయి. మిగతా ఎక్కడా 44% కూడా పోలింగ్​కాలేదు.

ఇంకా వర్క్ ఫ్రమ్ హోంలోనే..

ఎన్నికల రోజు పెయిడ్ హాలీడే గా ప్రకటించాలని అన్ని ఐటీ కంపెనీలను ఎన్నికల సంఘం ఆదేశిస్తోంది. కానీ ఐటీ సేవలను కొన్ని కార్పొరేట్​సంస్థలు ఎమర్జెన్సీ సర్వీసెస్ గా పేర్కొంటూ సెలవులు ఇవ్వడం లేదు. దీంతో పోలింగ్ రోజు ఎంప్లాయీస్ డ్యూటీలకు వెళ్తున్నారు. హాలీడే ఇచ్చినా సరే చాలామంది దాన్ని జాలీ డేగా వాడుతున్నారు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఎన్నికల రోజు సెలవిచ్చినా పెద్దగా ఉపయోగం ఉండటం లేదు. ఈసారి కరోనా ఎఫెక్ట్ తో చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం ఇచ్చాయి. దీంతో అంతా సొంతూళ్లకు వెళ్లిపోయారు.  ఆన్ సైట్ ఆఫర్లతో సిటీ వదిలి వెళ్లినవారు కూడా లక్షన్నరకు పైగా ఉంటారని తెలంగాణ ఐటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాలా తెలిపారు.  దీంతో గతంలో కన్నా ఐటీ ఎంప్లాయీస్ ఉండే డివిజన్లలో ఈసారి పోలింగ్ మరింత తక్కువ అవుతుందని అంచనా వేస్తున్నారు.