సమస్యల వలయంలో శాతవాహన యూనివర్సిటీ

 సమస్యల వలయంలో శాతవాహన యూనివర్సిటీ

కరీంనగర్, వెలుగు: శాతవాహన యూనివర్సిటీ ప్రారంభించి 14 ఏండ్లు కావస్తున్నా సమస్యలు మాత్రం తీరడం లేదు. 2008లో కరీంనగర్ జిల్లాలో యూనివర్శిటీని నెలకొల్పారు. ఇటీవలే యూనివర్సిటీకి యూజీసీ 12బి గుర్తింపు..  వైస్ చాన్సలర్ నియామకం వంటి సానుకూల పరిణామాలు జరిగినా.. కొత్త కోర్సుల ఏర్పాటు లేకపోవడం, ఇతర సమస్యలను సర్కారు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే యూనివర్సిటీలో స్టాఫ్ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు నిత్యం వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల 12బి రాకుండా లెటర్లు రాసి అడ్డుకునే యత్నాలు చేశారని స్టాఫ్ ను తొలగించారు. యూనివర్సిటీలో పని చేస్తున్న కొందరు ప్రొఫెసర్లు అవినీతికి పాల్పడ్డారని, మరికొందరు ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నారని ఇటీవల సామాజిక కార్యకర్తలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడంతో యూనివర్సిటీ మరోసారి వార్తల్లోకి వచ్చింది. 

అన్ని ఖాళీలే.. 

యూనివర్సిటీలో మొత్తం రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు కలిపి 14  ఉన్నాయి. సైన్స్ విభాగంలో కెమిస్ట్రీ, ఫిజిక్స్, బోటనీ, మ్యాథమేటిక్స్ రెగ్యులర్ కోర్సులు కాగా.. ఆర్ట్స్ విభాగంలో ఎకనామిక్స్, సోషియాలజీ, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ రెగ్యులర్ కోర్సులు. సెల్ఫ్ ఫైనాన్స్ కింద కంప్యూటర్ సైన్స్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్వహిస్తున్నారు. బీ ఫార్మసీ కోర్సు ఓల్డ్ పీజీ సెంటర్ లో నిర్వహిస్తున్నారు. ఇన్ని కోర్సులు ఉన్నా స్టూడెంట్స్ కు బోధించేందుకు ఫ్యాకల్టీ మాత్రం లేరు. ప్రొఫెసర్ పోస్టులు 10 మంజూరు కాగా.. ఇందులో  ఎనిమిది  ఖాళీగా ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్లు 16 కుగాను ఆరుగురే ఉన్నారు. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్  పోస్టులు 37 మంజూరు కాగా.. 27 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవేగాక మిగిలిన రెగ్యులర్ కోర్సులకు  రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 42  రెగ్యులర్ పోస్టులు మంజూరు  కావాల్సి ఉంది. ఉన్న పోస్టులే తెచ్చుకోలేని స్థితిలో మిగిలిన కోర్సులకు రెగ్యులర్ పోస్టులు వస్తాయా అనే సందేహం నెలకొంది.

కొత్త కోర్సులకు అవకాశం ఉన్నా..

కొత్త కోర్సులు తీసుకురాకపోవడం కూడా యూనివర్సిటీ అభివృద్ధికి ఆటంకంగా మారింది. ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ లాంటి కొత్త కోర్సులు ప్రవేశపెట్టినా బోధించేందుకు రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరు. కోర్సు పూర్తయిన తరవాత ఉపాధి అవకాశాలు కల్పించే ప్లేస్ మెంట్ సెల్ లు ఏర్పాటు చేయకపోవడంతో చేరేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఇక కొత్త కోర్సులకు అవకాశం ఉన్నా వాటి గురించే పట్టించుకోవడం లేదు. ఈ ప్రాంతవాసులు ఎన్నో రోజులుగా బీఈడీ, ఎంఈడీ, బీపెడ్, ఎల్ఎల్బీ, ఇంజినీరింగ్ కోర్సుల కోసం ఎదురు చూస్తున్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఫారెస్ట్రీ, మైనింగ్, ఫిషరీస్, బిజినెస్ మేనేజ్ మెంట్, అగ్రి బేస్డ్ ఇండ్రస్ట్రియల్ కోర్సులు తీసుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నా.. నిధులు, మానవ వనరుల కొరతతో అడుగు ముందుకు పడడం లేదు. 

నాలుగు కోర్సులు సెల్ఫ్ ఫైనాన్స్   

యూనివర్సిటీలో రెగ్యులర్ కోర్సులు తక్కువగా ఉన్నాయంటే వీటిలోంచే కొన్నింటిని సెల్ఫ్ ఫైనాన్స్ కింద మారుస్తున్నారు. జూన్ 6న జరిగిన ఈసీ మీటింగ్​లో బోటనీ, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్ కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ కింద మార్చాలని తీర్మానించారు.  రెగ్యులర్ కోర్సుల్లో జాయిన్ అయ్యే స్టూడెంట్లు జాయినింగ్ టైమ్ లో నామినల్ ఫీజు సుమారు రూ. 3,500 చెల్లిస్తే సరిపోతుంది. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు మాత్రం ముందస్తుగా రూ. 25వేలు చెల్లించాల్సి ఉంటుంది.  ప్రభుత్వం తరవాత రీయింబర్స్ ​చేస్తుంది. యూనివర్సిటీకి వచ్చేవారంతా పేద, మధ్యతరగతి వాళ్లే ఉంటారు. ఒకేసారి ఇంత మొత్తం చెల్లించడం వారికి ఆర్థికంగా భారం కానుంది. దీంతోపాటు ఆయా కోర్సులకు ఎలాంటి రెగ్యులర్ ఫ్యాకల్టీని నియమించరు. కాంట్రాక్ట్, పార్ట్ టైమ్ వారితోనే వెళ్లదీస్తరు. చదువులో నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉంది.  స్టూడెంట్స్ ను దృష్టిలో ఉంచుకుని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ప్రక్రియను మానుకోవాలని స్టూడెంట్లు, తల్లిదండ్రులు, మేధావులు డిమాండ్ ​చేస్తున్నారు.

సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాలె

యూనివర్సిటీలో పరీక్షల విభాగానికి ప్రత్యేక భవనం కట్టాల్సి ఉంది. అగ్నిప్రమాదాల నివారణకు ఓ  ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేయాలి. తరచూ ఎలుగుబంట్ల సంచారంతో స్టూడెంట్లు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పన దిశగా నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది.  ప్రస్తుతం ఉన్న హాస్టల్స్ సంఖ్య పెంచాలని, క్యాంపస్ లో బ్యాంకు, పోస్టాఫీసు ఏర్పాటు చేయాలని స్టూడెంట్లు కోరుతున్నారు. క్యాంపస్ లో డిస్పెన్సరీ పెట్టి ఎంబీబీఎస్ డాక్టర్ ను ఏర్పాటు చేయాలని, సిటీకి దూరంగా క్యాంపస్ ఉండటం వల్ల.. యూనివర్శిటీ వరకు ఉదయం, సాయంత్రం ఆర్టీసీ బస్సు సౌకర్యం కావాలని 
కోరుతున్నా స్పందన కరువైంది. 

పార్ట్​టైం సిబ్బందితో క్లాసుల నిర్వహణ 

యూనివర్సిటీ క్యాంపస్ సైన్స్, కెమిస్ట్రీ విభాగంలో రెగ్యులర్ ఫ్యాకల్టీ ఏడుగురు(ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్, నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు) ఉండాలి. కానీ ఇక్కడ  ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రమే రెగ్యులర్ వాళ్లు ఉన్నారు. 2013లో బోటనీ, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలను రెగ్యులర్ కోర్సులుగా ప్రవేశపెట్టినా పోస్టులు మంజూరు చేయలేదు. దీంతో డిపార్ట్ మెంట్ కు నలుగురు చొప్పున మొత్తం కాంట్రాక్ట్ వాళ్లే పని చేస్తున్నారు. ఎకనమిక్స్ వంటి డిపార్ట్ మెంట్ లో ఇద్దరు రెగ్యులర్ అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారు. సోషియాలజీ రెండో ఏడాది స్టూడెంట్స్ తొమ్మిది మందే ఉన్నారు. కానీ ఇక్కడ  ముగ్గురు రెగ్యులర్, ఒక కాంట్రాక్ట్ తో పాటు మరో ఇద్దరు పార్ట్ టైమ్ ప్రొఫెసర్లు పని చేస్తున్నారు. ఇలా అన్ని కోర్సులకు సమ ప్రాధాన్యత లేకపోవడంతో స్టూడెంట్లు నష్టపోతున్నారు. ఫార్మసీ విభాగంలో మొత్తం 18 పోస్టులకు కేవలం 9 మంది కాంట్రాక్ట్ వారితోనే నడిపిస్తున్నారు.   

సౌకర్యాలు కల్పిస్తున్నం

యూనివర్సిటీలో చదివే స్టూడెంట్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నం. ఖాళీలు ఉన్నా.. ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుతో రిటైర్డ్ ప్రొఫెసర్లతో బోధన అందిస్తున్నం. ప్రభుత్వ ఆదేశాలతో ఫుల్ టైమ్ నియామకాలు జరుగుతాయి. ఈసీ మీటింగ్ లో తెలుగు, ఇంగ్లీష్​, మ్యాథ్స్, బోటనీ కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా మార్చాం. స్టూడెంట్లకు  ప్రభుత్వం అందించే స్కాలర్​షిప్ లు సరిపోతాయి.  
– డాక్టర్ సంకశాల మల్లేశ్, వైస్ చాన్స్ లర్, శాతవాహన యూనివర్సిటీ