
- ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
- నిందితుల్లో ఒకరు సింగరేణి కార్మికుడు
కోల్‌బెల్ట్, వెలుగు : సింగరేణి సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మించి రూ.5 లక్షలు తీసుకొని మోసం చేసిన ఇద్దరిని సోమవారం మంచిర్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ బన్సీలాల్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమగూడెంనకు చెందిన విష్ణు ప్రసాద్ సింగరేణి మందమర్రి ఏరియా కాసీపేట 1 గనిలో పనిచేస్తున్నాడు. ఇతడు మంచిర్యాలకు చెందిన బేర నగేశ్ కుమార్ అనే వ్యక్తి భార్యకు సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తానని 2022లో నమ్మించాడు.
వరంగల్‌కు చెందిన దాసు హరికిషన్‌కు సింగరేణిలో బాగా పరిచయాలు ఉన్నాయని అతడి ద్వారా ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. ఇందుకోసం రూ. 15 లక్షలు ఖర్చు అవుతాయని చెప్పడంతో హరికిషన్‌కు రూ. 5 లక్షలు ఇచ్చాడు. ఎంతకూ ఉద్యోగం ఇప్పించకపోవడంతో అనుమానం వచ్చిన నగేశ్ ఇద్దరినీ నిలదీశాడు. దీంతో హరికిషన్ తప్పించుకొని పోగా, విష్ణుప్రసాద్ తనకు సంబంధం లేదంటూ చెప్పాడు.
దీంతో నగేశ్ మంచిర్యాల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చీటింగ్ కేసు నమోదు చేసి సోమవారం విష్ణుప్రసాద్, హరికిషన్‌ను అరెస్ట్ చేశారు. హరికిషన్‌పై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8 చీటింగ్ కేసులున్నాయని, రెండు నెలల కింద జైలుకు వెళ్లి వచ్చినట్లు విచారణలో తెలిందని పోలీసులు తెలిపారు.