
జనగాం దగ్గరున్న కొలనుపాక గొప్ప జైనక్షేత్రం. ఆ ప్రాంతంలో ‘నవాబ్ తురాబ్ యార్జంగ్’ అనే జాగీర్దారు చేసే దౌష్ట్యాలకు అంతేలేదు. దళితులను ముస్లింలుగా మార్చే మతమార్పిడికి అతడు పూనుకున్నాడు. అప్పటికే ఆ ప్రాంతంలో వెట్టిచాకిరి విముక్తికి, అధిక పన్నుల నిరోధానికి వ్యతిరేకంగా ఉద్యమం నడుస్తోంది. అయితే, అతని మతమార్పిడికి వ్యతిరేకంగా ఆర్య సమాజం శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తే, దానికి వెన్నుదన్నుగా కొలనుపాకకు చెందిన, కమ్యూనిస్టు పార్టీలో ప్రసిద్ధులైన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి అండగా నిలచి జాగీర్దారు అరాచకాలకు అడ్డుకట్ట వేశారు. విచిత్రం ఏమిటంటే ఈ రోజు ‘భారతీయ జనతాపార్టీ’ అధికారంలోకి రావద్దని, ‘విమోచన దినాన్ని’ విస్మృత గాథగా మార్చాలని కమ్యూనిస్టులు చేస్తున్న తార్కికవాదం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.
చరిత్ర చదవండి సార్.. ప్లీజ్!
ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ వంటి కమ్యూనిస్టులు ముస్లింలీగ్‌ను తలపై మోసారు. ఇదే ధోరణి నిజాం రాజుపై ఉండేది. రాచరిక వ్యవస్థను విలాసవంతంగా గడిపిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ కమ్యూనిస్టులకు సెక్యులర్! అతడు చేసిన దురంతాలు కనపడకుండా కళ్లకు గంతలు కట్టుకోవాలా? ఇక్కడున్న తెలుగు, మరాఠా, కన్నడ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా 11 శాతం ఉర్దూ మాట్లాడేవారి కోసం ఫర్మానా జారీ చేసిన సర్ అక్బర్ హైదరీ ఉద్దేశాలు ఏమిటో చరిత్రను దాచాలనుకుంటున్న అపర మేధావులు చెప్పగలరా? 1929లో బాలికల కోసం నారాయణగూడలో ఓ పాఠశాల స్థాపిస్తే ‘తెలుగు బోధనా మాధ్యమం’ అంటూ రద్దు చేసిన విషయం ఇప్పుడు భాష కోసం గొంతుచించుకొని ‘హిందీ’ దక్షిణాదిపై రుద్దుతున్నారని అరిచే వాళ్లకైనా తెలుసా? సూర్యాపేటలో స్థాపించిన ఆంధ్ర ప్రకాశినీ గ్రంథాలయంను పర్యటనకు వచ్చి చూసి, వెంటనే మూసేయాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఈలోపు వరంగల్ అదాలత్ నాజింసా నుండి ఇంకో ఆజ్ఞ (నిషాన్ 23 తేదీ 12 మెహర్ 1333 ఫ) ఎందుకు జారీ అయిందో ఈ మేధావులు చెప్పగలరా? తెలంగాణ రైతాంగ పోరాటంలో కన్నుమూసిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య సొంత అన్న ‘దొడ్డి మల్లయ్య’ మతంమారి ‘ఖాదర్అలీ’గా ఎందుకు మారాడో లిబరల్ మేధావులు చెప్పగలరా? కాళోజీని కాలగర్భంలో కలిపేద్దామా? ‘ఓరీ నిజాము పిశాచమా?’ అని గొంతెత్తి అరిచిన దాశరథిని మన మాయల చరిత్రలో దాచేద్దామా?
కనీసం మీ చరిత్రలైనా..!
కమ్యూనిస్టు యోధుడు చండ్ర రాజేశ్వరరావు రచించిన ‘చారిత్రాత్మక తెలంగాణ పోరాటం’, నిఖార్సయిన గాంధేయవాది వెల్దుర్తి మాణిక్యరావు రాసిన ‘హైదారాబాద్ సంస్థానంలో స్వాతంత్ర్యోద్యమం’, తెలంగాణ కాంగ్రెస్‌లో పోరాటయోధుడైన స్వామి రామానందతీర్థ రచించిన ‘హైదరాబాదు స్వాతంత్య్ర పోరాటం’, వందేమాతరం రామచంద్రరావు సోదరులు రాసిన ‘హైదరాబాద్ పోలీసు చర్య’ పుస్తకం అన్నా ఒక్కసారి తిరగేసి చూడండి. పోనీ మనం ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నాక 2014లో ప్రభుత్వం ‘తెలుగు అకాడమీ’ ద్వారా ముద్రించిన ‘వెలపాటి రామారెడ్డి’ ‘తెలంగాణ సాయుధ పోరాటం’ అయినా పరిశీలించండి. మగ్దూం మొహియుద్దీన్, హీరాలాల్ మోరియా వంటి వాళ్ల కవిత్వమన్నా చదవండి ప్లీజ్! తెలంగాణలో నిజాం పాలనలో రజాకార్లు సాగించిన ఊచకోతలు తీవ్రస్థాయి అనే చెప్పొచ్చు. జర్నలిస్ట్ షోయబుల్లాఖాన్ ‘ఇమ్రోజ్’ పత్రిక నడిపి ఖాసీం
రజ్వీకి వ్యతిరేకంగా రాసినందుకు హైదరాబాద్ నడ్డిబొడ్డున ప్రాణం పోగొట్టుకొన్నాడు. ఇదే హైదరాబాద్‌లో సాక్షాత్తు ప్రెస్ క్లబ్లో రచయిత్రి తస్లీమా నస్రీన్‌పై దాడి జరగలేదా? 21 ఆగస్టు 1948 నాటి షోయబ్ హత్య, ఈ మధ్యకాలంలో తస్లీమాపై జరిగిన దాడిలో ఏదైనా తేడా ఉందా? కాబట్టి ఈ అకారణ భయం, అన్యద్వేషంతో కూడింది తప్ప ఇంకేం లేదు.
రజాకార్లపై పోరాటం మరిచిపోతే ఎలా?
15 ఏప్రిల్ 1938 నాటి ధూల్‌పేట ఘటనలో బహదూర్ యార్ జంగ్ రజాకార్లను అక్కడి ప్రాంతంపైకి ఉసిగొల్పాడు. అక్కడి లోధ్ క్షత్రియులు, ప్రజలు తిరగబడితే బహదూర్ యార్ జంగ్ ఇద్దరు కొడుకులు మరణించారు. దళిత, గిరిజన కులాల పేర్లు ఉపయోగించుకుని మేధో రంగంలో తిష్టవేసినవారు ధర్మాపూర్ పడమటితాండ లంబాడీల పోరాటం మరిచిపోతే ఎలా? 1 డిసెంబర్ 1946 నాడు హుజూరాబాద్ మల్లారెడ్డిగూడెంలోని చింద్రాల తొండమ్మ, గుర్వమ్మ, అంకాళమ్మ అనే ‘దళిత మహిళాత్రయం’ రజాకార్లను ఎదిరించి ప్రాణం పోగొట్టుకున్న విషయం మనకు కన్పించదా? నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడినవాళ్లలో వరంగల్ నారాయణరెడ్డి, జనగాం శఠగోపాలాచారి, చాకలి ఐలమ్మ, మొగిలయ్య గౌడ్, వందేమాతరంరామచంద్రరావు, స్వామి రామానందతీర్థ, గడియారం రామకృష్ణశర్మ, పాగ పుల్లారెడ్డి, నారాయణరావ్ పవార్, షోయబుల్లాఖాన్, గడ్డం సాంబయ్య, మంగలి చంద్రయ్య, పుట్నాల పులిరామక్క ఇలా అన్ని వర్గాలవారున్నారు. అలాంటప్పుడు ఈ ‘లిబరల్స్’ వర్గపోరాటం అర్థం ఏమిటి? లేని చరిత్రను సృష్టించాలనే తాపత్రయం ఎందుకు? ఇలాంటి చారిత్రక తప్పిదాలు చేయడం ఈ దేశంలో వామపక్షాలకు అలవాటే. అది తెలుసుకుని పశ్చాత్తప పడడం ఒక అలవాటుగా మారింది.
కాళోజీ ఆత్మఘోషనైనా అర్థం చేసుకోవడం లేదు!
వరంగల్‌లో డా. నారాయణరెడ్డి హత్య జరిగాక కోర్టులో ‘ఇత్తెహాదుల్ ముసల్మీన్’ స్థానిక అధ్య క్షుడు, కార్యదర్శి మధ్య ‘నేను కూర్చోలేనని వీళ్ల వద్ద పచ్చి నెత్తురు వాసన వస్తుందని’ నిరసన తెలిపిన కాళోజీ ఆత్మ ఘోషనైనా పట్టించుకోండి. కొమరం భీంను జల్- జంగల్-జమీన్ సిద్ధాంతం గొప్పది. సిద్ధిఖీని కొమరం భీం ఎందుకు కొట్లాడవల్సి వచ్చిందో ఆలోచించండి. జియా- ఉల్లా పిస్తోలుకు బలైన పరకాల అమరులు గజ్జి పర్వతాలు, కుంట ఐలయ్య, పోతుగంటి, బత్తుల సమ్మయ్య, మేకల పోచయ్య తదితర పెద్దలు మొదలైనవారి ‘పీనుగుల దిబ్బ’ను చూసి కాంగ్రెస్ హౌజ్ బొంబాయి వారు విడుదల చేసిన ‘బులెటిన్’ ఒక్కసారి చదవండి. బడపల్లి సత్తయ్య, కొత్తగట్టు జనార్దన్, మొగుళ్లపల్లి ఆచారి కూతుళ్లు ఎవరు? తెలంగాణ ప్రాంతం అంతా ఒకప్పుడు పాడుకున్న ఉయ్యాలపాట ‘నక్కా అండాలమ్మ’ అనే భువనగిరి బాలికది అన్న విషయం మన మేధకు ఎక్కదా? ఇలా చెప్తూపోతే ‘తెలంగాణ విమోచన’కు ముందు చరిత్ర అంతా రక్తపు మరకలే. ఇప్పటికైనా చరిత్రను చెరిపివేయొద్దు. తెలంగాణ విమోచనాన్ని అంగీకరించక తప్పదు. తెలంగాణ విమోచనం అందరి పండుగ. చరిత్ర నిజాలను అంగీకరిద్దాం.
డా. పి. భాస్కరయోగి,
సోషల్,
పొలిటికల్ ఎనలిస్ట్