అక్టోబర్ 18న రాష్ట్రానికి రాహుల్, ప్రియాంక!

అక్టోబర్ 18న రాష్ట్రానికి రాహుల్, ప్రియాంక!
  • కొండగట్టులో ప్రత్యేక పూజలు.. అదే రోజు బస్సు యాత్ర షురూ
  • అంజన్న సన్నిధిలోనే ప్రచార రథాలను ప్రారంభించనున్న నేతలు
  • అదే రోజు సాయంత్రం జగిత్యాలలో రోడ్​ షో

హైదరాబాద్​/జగిత్యాల/కొండగట్టు, వెలుగు :  కాంగ్రెస్ ​హైకమాండ్ ​మరోసారి రాష్ట్ర పర్యటనకు వస్తున్నది. రాహుల్​గాంధీ, ప్రియాంక గాంధీ ఈ నెల18న తెలంగాణకు వస్తారని తెలుస్తున్నది. మూడు రోజుల పాటు వారిద్దరూ ఇక్కడే ఉంటారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.18, 19, 20 తేదీల్లో నిర్వహించే బస్సు యాత్రల్లో వాళ్లు పాల్గొంటారని సమాచారం. వాస్తవానికి ఈ నెల15న బస్సు యాత్రను ప్రారంభిస్తారని అనుకున్నా, సోమవారం లిస్ట్​ ప్రకటించే అవకాశం ఉండటంతో 18వ తేదీన కొండగట్టు అంజన్న సన్నిధిలోనే బస్సు యాత్రను ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిసింది.

అందులో భాగంగానే శుక్రవారం ఢిల్లీలో జరిగిన స్క్రీనింగ్​కమిటీ సమావేశంలో తెలంగాణ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ టూర్ ​వివరాలను ప్రతిపాదించినట్టు తెలిసింది. సెంట్రల్​ ఎలక్షన్ కమిటీలోనూ దీనిపై చర్చించినట్టు సమాచారం. రాష్ట్ర నేతల ప్రతిపాదనకు రాహుల్, ప్రియాంకలు సూచనప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది. టూర్​లో భాగంగా18న(బుధవారం) రాహుల్, ప్రియాంక జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్టు తెలుస్తున్నది. పూజా కార్యక్రమాలు పూర్తయిన వెంటనే ప్రచార రథాలను (బస్సులు) వారిద్దరూ జెండా ఊపి ప్రారంభిస్తారని చెప్తున్నారు.

అనంతరం అదే రోజు మల్యాల మీదుగా జగిత్యాల చేరుకుని కొత్త బస్టాండ్​ చౌరస్తాలో రోడ్​షో నిర్వహిస్తారని, అక్కడ రాహుల్​గాంధీ ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, రాహుల్, ప్రియాంక పర్యటనల నేపథ్యంలో జగిత్యాల, కొండగట్టు వద్ద ఏర్పాట్లను ఏఐసీసీ సెక్రటరీ సుశాంక్​మిశ్రా, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్​కుమార్, మేడిపల్లి సత్యంలు పరిశీలించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని జగిత్యాల నుంచే రాహుల్​ గాంధీ ప్రారంభిస్తుండటం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి అన్నారు. 

రూట్ ​మ్యాప్​ ఖరారు?

వాస్తవానికి తొలుత ఆదిలాబాద్ ​జిల్లా నుంచి బస్సు యాత్ర ప్రారంభించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. పొలిటికల్​అఫైర్స్​కమిటీ మీటింగ్​లోనూ దీనిపై చర్చించారు. అయితే, తాజాగా బస్సు యాత్రను కొండగట్టు నుంచి ప్రారంభించాలని పార్టీ నేతలు డిసైడ్​అయినట్టు తెలిసింది. అందుకు అనుగుణంగా బస్సు యాత్ర రూట్ మ్యాప్​నూ ఖరారు చేసినట్టు తెలిసింది.

కొండగట్టు నుంచి ప్రారంభించి నిజామాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలతో పాటు ఉత్తర తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ రాహుల్​, ప్రియాంకలు బస్సు యాత్ర చేసేలా రూట్​మ్యాప్​ సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. మరోవైపు కొండగట్టులో రాహుల్, ప్రియాంకలతోపాటు పీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి, స్థానిక నేతలతో పాటు మరికొందరు సీనియర్​నేతలూ ప్రత్యేక పూజల్లో పాల్గొంటారని తెలుస్తున్నది. ఇక, వారి టూర్​ పూర్తికాగానే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఆ తర్వాతి బస్సు యాత్రల్లో పాల్గొంటారని చెప్తున్నారు. జాతీయ స్థాయి నేతలు వరుసగా రాష్ట్రానికి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.