- బజ్‌రంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామన్న కాంగ్రెస్ హామీపై ప్రధాని ఫైర్
- కర్నాటకలోని హొస్పేట్, చిత్రదుర్గలో మోడీ ప్రచారం
హొస్పేట్/చిత్రదుర్గ: కర్నాటకలో బజ్‌రంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామంటూ కాంగ్రెస్ ఇచ్చిన హామీపై ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. హనుమంతుడి భక్తులను జైలులో పెట్టాలని చూస్తోందని విమర్శించారు. ‘‘కాంగ్రెస్ గతంలో రాముడిని ఖైదు చేసింది. ఇప్పుడు ‘జై బజ్‌రంగ్ బలీ’ అని నినదించే వారిని జైలులో పెట్టాలని చూస్తోంది” అని ఆరోపించారు. కర్నాటకలోని విజయనగర జిల్లాలోని హోస్పేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడారు. ‘‘హనుమంతుడి నేలకు. హనుమంతుని భూమికి నమస్కరించే అవకాశం లభించడం నా అదృష్టం. కానీ ఇదే సమయంలో హనుమంతుడి భక్తులను నిషేధిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొనడం దురదృష్టకరం” అని అన్నారు. పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ను ఇప్పుడు ప్రతి చోట ప్రజలు తిరస్కరిస్తున్నారని ప్రధాని విమర్శించారు.
కాంగ్రెస్.. 85 శాతం కమీషన్ ప్రభుత్వం
‘‘పేదరికాన్ని నిర్మూలిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ పార్టీ హయాంలో కానీ పేదరికం తగ్గలేదు. కాంగ్రెస్ నేతలు మాత్రం కోటీశ్వరులు అయ్యారు. కాంగ్రెస్.. 85% కమీషన్ ప్రభుత్వం” అని ప్రధాని మోడీ విమర్శించారు. ‘‘ఈ రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలబెట్టాలి. ఇందుకు బీజేపీ కట్టుబడి ఉంది” అని చెప్పారు. కర్నాటక గౌరవాన్ని, సంస్కృతిని దెబ్బతీయడానికి బీజేపీ ఎవ్వరినీ అనుమతించబోదని స్పష్టం చేశారు. ‘‘విజయనగర సామ్రాజ్యం, దాని చరిత్ర భారతదేశానికి గర్వకారణం. శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రాంతాన్ని చిరస్థాయిగా నిలిపారు. వివిధ దేశాలతో వ్యాపార సంబంధాలను బలోపేతం చేశారు. కర్నాటక సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేశారు” అని చెప్పారు.
టెర్రరిస్టులను బుజ్జగించిన చరిత్ర కాంగ్రెస్‌ది
టెర్రరిస్టులను బుజ్జగించిన చరిత్ర కాంగ్రెస్‌దని ప్రధాని విమర్శించారు. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్‌ను నిర్వహించినప్పుడు భద్రతా బలగాలను కాంగ్రెస్ ప్రశ్నించిందని మండిపడ్డారు. టెర్రర్‌ను కాంగ్రెస్, జేడీఎస్ ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. కర్నాటకలో పెట్టుబడులను ఎన్నటికీ పెంచలేవని, యువతకు కొత్త అవకా శాలను సృష్టించలేవని అన్నారు. చిత్రదుర్గలో ప్రధాని మాట్లాడుతూ.. ‘‘కర్నాటక ప్రజలు కాంగ్రెస్ చరిత్రను, ఆలోచనలను ఎప్పటికీ మరచిపోకూడదు. టెర్రర్, టెర్రరిస్టులను బుజ్జగించడమే కాంగ్రెస్ చరిత్ర. ఢిల్లీలో బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు.. ఉగ్రవాదుల మరణం గురించి విన్న కాంగ్రెస్ అగ్రనేత కళ్లలో నీళ్లు తిరిగాయి” అని విమర్శించారు. ఉగ్రవాదు ల వెన్ను విరిచి, బుజ్జగింపు ఆటను ముగించింది బీజేపీ అని చెప్పుకొచ్చారు. వారంటీ లేని కాంగ్రెస్ గ్యారంటీలు అబద్ధాలేనని చెప్పారు.
