- పుట్టింది తమిళనాడులోనైనా.. తెలంగాణే నా కర్మభూమి: ప్రొఫెసర్ కార్తీక్ మురళీధరన్
హైదరాబాద్, వెలుగు: గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకోవడం అద్భుతం.. కానీ ఆ లక్ష్యాలను చేరాలంటే ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం అంతకంటే ముఖ్యమని ప్రముఖ ఆర్థికవేత్త, టాటా చాన్స్‌లర్ ప్రొఫెసర్ కార్తీక్ మురళీధరన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్-2047’ ఆవిష్కరణ సభలో పాల్గొని ప్రసంగించారు. 1950 నాటి పాలనా పద్ధతులే ఇంకా కొనసాగుతున్నాయని వాటిని సమూలంగా ప్రక్షాళన చేయకపోతే మనం పెట్టుకున్న ‘గ్లోబల్ బెంచ్‌మార్క్’ లక్ష్యాలను చేరుకోలేం’’ అని అన్నారు. ‘‘విద్య, ఆరోగ్యం, భూమి, కార్మికులు, రక్షణ.. ఇలా ప్రజల జీవితాలను స్పృశించే ప్రతీ అంశం రాష్ట్ర పరిధిలోనిదే.
కేంద్రం మార్గదర్శకాలు, నిధులు ఇస్తుంది. కానీ డెలివరీ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే’’ అని తెలిపారు. అందుకే రాష్ట్రాల పనితీరులో తేడాలు ఉంటాయని, తెలంగాణ గ్లోబల్ బెంచ్‌మార్క్‌లను నిర్దేశించుకోవడం ద్వారా రాష్ట్రాన్నే కాదు.. భారతదేశ ప్రమాణాలను కూడా పెంచుతున్నదన్నారు. ‘‘నేను పుట్టింది తమిళనాడులో.. పెరిగింది గుజరాత్‌లో.. కానీ 20 ఏళ్లుగా నా కర్మభూమి మాత్రం తెలంగాణ, ఏపీలే’’ అని కార్తీక్ చెప్పారు. తన పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు అందించినప్పుడు.. పాలనపై వారితో జరిపిన రెండు గంటల చర్చ అద్భుతమని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

