ఆఫీసుకు పిల్లలనూ వెంట తీసుకెళ్లొచ్చు!

ఆఫీసుకు పిల్లలనూ వెంట తీసుకెళ్లొచ్చు!
  • మేనేజ్​మెంట్లతో డే కేర్ సెంటర్లు టై అప్
  • కొన్నిచోట్ల ఫ్రీగా, మరికొన్ని కంపెనీల్లో తక్కువ చార్జీలతో సేవలు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీలో భార్యాభర్తలిద్దరూ జాబ్ ​చేస్తే పిల్లలను చూసుకునే వీలులేని పరిస్థితి. దీంతో వారు డే కేర్ సెంటర్లలో, ప్లే స్కూళ్లలో పిల్లలను చేర్పిస్తుంటారు. కానీ వారు అక్కడ ఎలా ఉన్నారో అనే బెంగ మాత్రం పేరెంట్స్​ను వెంటాడుతూనే ఉంటుంది. తల్లిదండ్రులు పడే ఇలాంటి వేదనకు కొన్ని సంస్థలు పుల్​స్టాప్ ​పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కంపెనీల్లోనే డే కేర్​సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో పిల్లలను తల్లిదండ్రులు నేరుగా ఆఫీసులకే తీసుకొని వెళ్తున్నారు. అక్కడి డే కేర్ సెంటర్లలో వదిలి పనిచేసుకుంటున్నారు. సిటీలోని పలు కంపెనీలు ఇలాంటి సేవలు అందిస్తున్నాయి. కొన్ని చోట్ల ఉచితంగా, మరికొన్ని చోట్ల తక్కువ చార్జీలతో ఈ‌‌‌‌‌‌‌‌ ఫెసిలిటీని అందిస్తున్నాయి.

ఒకేచోట ఉండేలా..

ఐదేండ్లుగా సిటీలోని పలు కంపెనీల్లో డే కేర్ సెంటర్ల సౌకర్యం ఉన్నప్పటికీ లాక్​డౌన్​తో అంతా మారిపోయింది. అయితే మళ్లీ మాములు స్థితికి రావడంతో తిరిగి కంపెనీలు తమ ఉద్యోగులకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. కంపెనీకి సంబంధించిన బిల్డింగ్‌‌‌‌‌‌‌‌లోనే ఈ డే కేర్ సెంటర్​ను ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలను మరో చోట ఉంచి వారికి దూరంగా ఉంటున్నామనే బాధ నుంచి తల్లిదండ్రులను ఉపశమనం కలిగిస్తున్నాయి. పిల్లలను  నేరుగా ఆఫీసుకే తీసుకువస్తున్నారు. వర్క్ చేసుకుంటూనే నచ్చిన సమయంలో డే కేర్​సెంటర్​కు వెళ్లి పిల్లలను చూసుకుంటున్నారు. ఫలితంగా ఎలాంటి ఆందోళన లేకుండా పనిచేసుకుంటున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తక్కువ చార్జీలతో..

సిటీలోని పలు కంపెనీలు తమ ఉద్యోగులకు ఈ సౌకర్యాన్ని ఉచితంగా అందిస్తున్నాయి. కంపెనీ మేనేజర్ నుంచి పర్మిషన్ తీసుకుని పిల్లలను సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేర్పించాల్సి ఉంటుంది. సిటీలోని చాలా కంపెనీలతో ప్రీ స్కూల్స్, డే కేర్ సెంటర్ కంపెనీ టై అప్ అయ్యి ఆఫీస్‌‌‌‌‌‌‌‌ల్లో ఈ ఫెసిలిటీ అందిస్తోంది. కొన్ని చోట్ల బయటతో పోలిస్తే తక్కువగా చార్జ్ ​చేస్తూ పిల్లల ఆలనాపాలనా చూసుకుంటోంది. అవర్లీ బేసిస్​లో కూగా ఉపయోగించుకునే సౌకర్యం కల్పిస్తోంది. అన్ని కంపెనీల్లో ఇలాంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే బాగుంటుందని ఉద్యోగులు, ముఖ్యంగా తల్లిదండ్రులు కోరుతున్నారు.

నాతో పాటే తీసుకెళ్తున్నా

మా పాపను నాతో పాటే ఆఫీసుకు తీసుకెళ్తున్నా. అక్కడి డే కేర్ సెంటర్​లో ఉంచి..  బ్రేక్ టైమ్​లో వెళ్లి చూస్తా. సెంటర్లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా చూసు కుంటారు. కొన్ని కంపెనీల్లో చాలా కాలం నుంచే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.   - అక్షర, ఐటీ ఎంప్లాయ్, ఉప్పల్

చాలా కంపెనీల్లో.. 

ఈ తరహా సేవలు గతంలో బెంగుళూరులో ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు సిటీలోనూ  ఈ ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. చాలా కంపెనీల్లో ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలతో ఓ డే కేర్ సంస్థ టై అప్ అయ్యి సేవలందిస్తోంది. 
- శ్రీధర్ మెరుగు, ఫౌండర్, ఐటీ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ ఫోరం