బీఆర్ఎస్ అభ్యర్థులకే.. సెక్యూరిటీ ఇవ్వడం సరికాదు : ప్రకాశ్ రెడ్డి

బీఆర్ఎస్ అభ్యర్థులకే.. సెక్యూరిటీ ఇవ్వడం సరికాదు : ప్రకాశ్ రెడ్డి

అన్ని పార్టీల క్యాండిడేట్లకు ప్రొటెక్షన్ కల్పించాలి: ప్రకాశ్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఆ పార్టీ ఎంపీలకు మాత్రమే 4 ప్లస్ 4 సెక్యూరిటీ ఇవ్వడం సరికాదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. ఇంటెలిజెన్స్ అడిషనల్ కమిషనర్ అనిల్ కుమార్ లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్ని పార్టీల అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ శాఖదే అని తెలిపారు. ఒక పార్టీ లీడర్లకు మాత్రమే రక్షణ కల్పించాలని ఆదేశాలు ఇవ్వడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీస్​లో కిషోర్ రెడ్డితో కలిసి ప్రకాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని, ఇలాంటి వాటిని బీజేపీ సమర్థించదని స్పష్టం చేశారు.

‘‘మా దగ్గర కత్తులు ఉన్నాయి. మేమూ పొడవగలం”అని సీఎం కేసీఆర్ అనడమేంటని ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదన్నారు. కేసీఆర్ మాటలు వింటుంటే రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేలా ఉన్నాయని ఆరోపించారు. కత్తిపోట్ల కేసులో నిందితుడు బీజేపీ కార్యకర్త అని ఒక పోలీసు అధికారి ప్రకటించడాన్ని ఆయన ఖండించారు. ఎలాంటి విచారణ లేకుండానే అలాంటి ప్రకటన చేయడంపై ఫైర్ అయ్యారు.