భాష కోసం ఉద్యమించాల్సి రావడం బాధాకరం: వెంకయ్యనాయుడు

భాష కోసం ఉద్యమించాల్సి రావడం బాధాకరం: వెంకయ్యనాయుడు
  • సంక్రాంతి వెలుతురు తెచ్చే పండుగ: పి. మురళీధర్ రావు    
  • తెలుగు సంగమం ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు 

హైదరాబాద్/గండిపేట, వెలుగు:   తల్లిదండ్రులను మమ్మీ, డాడీ అని కాకుండా.. అమ్మా, నాన్నా అని పిలిచేలా పిల్లలకు నేర్పించాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మన భాషను మనం కాపాడుకోటానికి ఉద్యమించాల్సి రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోయినా, వారి పద్ధతులు, ఆలోచన విధానాలు ఇంకా కొనసాగుతున్నాయని, వాటిని మర్చిపోతేనే దేశానికి మంచిదన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగిలోని ఓం కన్వెన్షన్ లో జరిగిన ‘తెలుగు సంగమం– సంక్రాంతి సమ్మేళనం’ వేడుకల్లో ఆయన చీఫ్ గెస్ట్ గా మాట్లాడారు. మాతృభాషను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఐదు అంశాల మీద దృష్టి పెట్టాలని కోరారు. ‘‘మాతృభాషలోనే ప్రాథమిక విద్య అందించాలి. పరిపాలనలో మాతృభాషకే ప్రాధాన్యం ఇవ్వాలి. కోర్టుల్లో కార్యకలాపాలు మన భాషలోనే సాగాలి. ఉన్నత, సాంకేతిక విద్యలోనూ సొంత భాష వినియోగం పెరగాలి. ఇండ్లలో మాతృభాషలోనే మాట్లాడాలి” అని పిలుపునిచ్చారు. నాడు దేశంలోని నలంద, తక్షశిల, విక్రమ్‌పురి వంటి విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు ప్రపంచ దేశాల నుంచి విద్యార్థులు వచ్చేవారని అన్నారు. ప్రపంచంలో ఒకప్పుడు భారత్‌ ధనిక, విద్యావంతుల దేశమని, దేశానికి విశ్వగురువు లాంటి రోజులు తిరిగి రావాలని అన్నారు. 

సంక్రాంతికి వేల ఏండ్లు.. 

తెలుగు ప్రజలకు సంక్రాంతి అనేది శాస్ర్తీయ పండుగ అని బీజేపీ నేత మురళీధర్ రావు అన్నారు. సంక్రాంతి తర్వాత చీకటి తగ్గి వెలుతురు పెరుగుతుందని, ఇది వేల ఏండ్లుగా సూర్య, చంద్ర గమనాన్ని పంచాంగ రూపంలో పాటిస్తూ జరుపుకునే పండుగన్నారు. భారతంలో భీష్ముడు సైతం చనిపోయేందుకు ఎంచుకున్న టైమ్ సంక్రాంతి పర్వదినమేనని చెప్పారు. తెలుగు సంగమం సంస్థ ఆరేండ్లుగా సంక్రాంతి వేడుకలు నిర్వహించడంపై అభినందనలు తెలిపారు. తెలుగువాళ్లు ఎక్కడున్నా సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటుంటారని అన్నారు. నిర్వహకులు ఏర్పాటు చేసిన స్టాల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. గవర్నర్ దత్తాత్రేయ, ప్రముఖ సినీ డైరెక్టర్ రాఘవేందర్ రావు, కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు.