ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దు.. ఇప్పటికే 29 మంది చనిపోయారు : సీఎం పిలుపు

ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దు.. ఇప్పటికే 29 మంది చనిపోయారు : సీఎం పిలుపు

హిమాచల్ప్రదేశ్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తమైంది. ప్రధాన నదులు పొంగిపొర్లుతున్నాయి. వందల కోట్లలో ఆస్తినష్టం వాటిల్లింది. భారీ వర్షాలు, వరదలపై హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ ఎప్పటికప్పుడూ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. పరిస్థితులను తెలుసుకుంటున్నారు. 

 రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం. ప్రజలందరూ తమ ఇండ్లల్లోనే ఉండాలని సీఎం సుఖు విజ్ఞప్తి చేశారు

భారీ వర్షాల కారణంగా ఇప్పటికే 29 మందికిపైగా చనిపోయారు. సిమ్లాలోని ఓ ఆలయంపై కొండచరియలు విరిగిపడి 9 మంది మృతిచెందారు. తాజాగా నీటి ప్రవాహంలో ఏడుగురు కొట్టుకుపోయారు. నదీ పరివాహక ప్రాంతాలు, కొండల ప్రాంతాలకు వెళ్లొద్దని ఇప్పటికే ప్రజలను అధికారులు హెచ్చరించారు. మరోవైపు.. ఆగస్టు 14, 15వ తేదీల్లోనూ అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రెడ్ అలర్జ్ కూడా జారీ చేశారు. 

ఇటు హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మరోవైపు.. విరిగిపడిన కొండచరియల వద్ద వేగంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది.

అంతకుముందు.. సీఎం సుఖ్విందర్ సింగ్ ఒక వీడియోను షేర్ చేశారు. అది జలప్రళయాన్ని తలపిస్తోంది. మండి జిల్లాలో సంబల్ గ్రామంలో పొంగుపొర్లుతున్న వరదనీటికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ నీటి ప్రవాహానికి ఏడుగురు వ్యక్తులు కొట్టుకుపోయారని చెప్పారు. ఈ భయానక పరిస్థితిని ఎదుర్కొనేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. జతోగ్‌, సమ్మర్‌ హిల్స్ రైల్వే స్టేషన్ మధ్య ఉన్న రైల్వే ట్రాక్ భారీ వర్షాల ధాటికి కొట్టుకుపోయింది. ఆ దృశ్యాల్లో ఆ రైల్వే ట్రాక్‌ గాల్లో వేలాడుతున్నట్లు కనిపిస్తోంది. దాంతో కాందఘాట్‌-సిమ్లా మధ్య తిరిగే రైళ్ల సర్వీసులను రద్దు చేశారు.

హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలకు సంబంధించిన సంఘటనల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలిపారు.