కేరళను ముంచెత్తిన వాన

కేరళను ముంచెత్తిన వాన
  • ఒకరు మృతి.. మరొకరు గల్లంతు 
  • 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
  • స్కూళ్లు, కాలేజీలు బంద్ 

తిరువనంతపురం: కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వానలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపైకి వరద చేరడంతో పాటు కొండచరియలు విరిగిపడి కొన్నిచోట్ల రాకపోకలు స్తంభించాయి. మరో రెండుమూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో 14 జిల్లాలు ఉండగా, 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఎక్కడికక్కడ చెట్లు, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. 

ఇండ్లు కూలిపోయాయి. పథనంతిట్ట జిల్లాలో వాగు దాటుతుండగా వరద ఉధృతికి ఆటో బోల్తా పడింది. డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. కోజికోడ్ జిల్లాలో 68 ఏండ్ల పెద్దాయన నదిలో గల్లంతయ్యాడు. కాగా, భారీ వర్షాలకు చాలా జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు బంద్ పెట్టారు. అధికారులు తీర, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను రిలీఫ్ క్యాంపులకు తరలిస్తున్నారు. ఎర్నాకులం, అలప్పుజ, కాసర్ గోడ్ జిల్లాల్లో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. 

ప్రాజెక్టుల గేట్లు ఓపెన్.. 

వరదలతో నదులు, రిజర్వాయర్లలో వాటర్ లెవల్స్ పెరిగాయి. దీంతో అధికారులు ప్రాజెక్టులు గేట్లు ఎత్తుతున్నారు. కల్లర్ కుట్టి, పంబ డ్యామ్​ల గేట్లు ఓపెన్ చేశారు. నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు 
జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.