ఉత్తరప్రదేశ్ లో కుండపోత వర్షాలు

ఉత్తరప్రదేశ్ లో కుండపోత వర్షాలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. లక్నో పరిధిలో రోడ్లన్నీ నీటమునిగాయి. పలు కాలనీలు జలమయం అయ్యాయి. జానకీపురంలోని ఇంజినీరింగ్ కాలేజ్, రివర్ ఫ్రంట్ కాలనీలు పూర్తిగా నీట మునిగిపోయాయి. వరదల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను లక్నో కమిషనర్ రోషన్ జాకోబ్ పరిశీలించారు. ఇటు గోరఖ్ పూర్ లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. రోడ్లపై మోకాల్లోతు నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

వర్షాలతో కూలిన గోడ

లక్నోలో ఘోర ప్రమాదం జరిగింది. దిల్ కుషా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇంటిగోడ కూలి తొమ్మిది మంది చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. అధికారులు స్థానికుల సాయంతో స్పాట్ లో సహాయకచర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు. 

ఎడతెరిపిలేని వర్షాల వల్లే గోడ కూలిందని, ఆ గోడ పక్కనే గుడిసెలో నివసిస్తున్న 9 మంది చనిపోయారన్నారు. ఈ ప్రమాదంపై స్పందించిన యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్.. మృతుల కుటుంబాలకు రూ. 4లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. దీంతో పాటు గాయపడిన వారికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.