
- చిట్ చాట్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నేతల పరిస్థితి చూస్తే బాధేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వాళ్లు విచ్చలవిడిగా వ్యవహరించారని ఆరోపించారు. శనివారం ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. " ఎల్లంపల్లి ప్రాజెక్టులోని మూడు పంపులు ఆన్ చేసి నీళ్లు ఎత్తిపోయడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ.
దానికి కూడా మేం హెచ్చరించగానే మోటార్లు ఆన్ చేశారని బీఆర్ఎస్ నేతలు చెప్పుకోవడం ఏమిటి? మేం ఇంకా ఏం చేయక ముందే బీఆర్ఎస్ నేతలు ఏదో జరిగిపోయినట్లు గగ్గోలు పెడ్తున్నారు. వాళ్లకు ముందుంది ముసళ్ల పండగ" అని రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నప్పడు చేసిన అవినీతిపై చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తే వారి పరిస్థితి ఏమవుతుందోనని పేర్కొన్నారు.