
హైదరాబాద్, వెలుగు:నీటి వాటాల కేటాయింపుల్లో తెలంగాణాకు అన్యాయం జరిగిన మాట నిజమేనని, దానిని సరిద్దిద్దాల్సిన బాధ్యత ట్రైబ్యునల్‌పై ఉందని సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్, తెలంగాణ సాక్షి ఘన్‌శ్యాం ఝా తెలిపారు. కృష్ణా జలాల పంపిణీపై మంగళవారం ఢిల్లీలో కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్ ఎదుట హాజరై ఆయన సాక్ష్యం చెప్పారు. ప్రాజెక్టుల నీటి కేటాయింపుల్లో పంటల వారీగా నీటి అవసరాల గణన శాస్త్రీయ పద్ధతిలో చేయడం కూడా అంతర్భాగమేనని చెప్పారు. ఇది తాను ట్రిబ్యునల్ ఎదుట దాఖలు చేసిన అఫిడవిట్ సెక్షన్ -89లోనే ఉందని, తాను వ్యవసాయ, సాగునీటి రంగాల్లో నిష్ణాతుడినేనని, తన పరిజ్ఞానాన్ని శంకించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బేసిన్‌లోని ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు సెక్షన్ -89లో అంతర్భాగమని చెప్పారు. బేసిన్‌లోని ప్రాజెక్టుల అవసరాలు తీరాకే బేసిన్ అవతలి అవసరాలకు నీటిని కేటాయించాల్సి ఉంటుందన్నారు. సంప్రదింపులతో బేసిన్ అవతలికి నీటి కేటాయింపుల అంశాన్ని పరిష్కరించవచ్చన్నారు.
ఇప్పుడున్న అవసరాలు రేపు ఉండకపోవచ్చని, అందుకే టైబ్యునల్‌లో రివ్యూ క్లాజ్‌ను ఏర్పాటు చేశారన్నారు. మారిన పరిస్థితుల మేరకు తెలంగాణ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకొని నీటి కేటాయింపులు చేయాలన్నారు. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ ఆర్. వెంకటరమణి క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్లు వైద్యనాథన్, రవీందర్‌రావు, కృష్ణమూర్తిస్వామి, ఇంటర్ స్టేట్ సీఈ నర్సింహారావు, టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు రవూఫ్, ఈఈలు విజయ్‌కుమార్, కోటేశ్వర్‌రావు, డీఈలు వెంకటనారాయణ, రవిశంకర్, ఏఈలు సునీల్, రయీజ్, అనురాగ్‌శర్మ తదితరులుహాజరయ్యారు.