కొత్త ఏడాది మొదటి వారంలోనే ఇద్దరు యువ డెలివరీ కార్మికులు ప్రమాదాలకు గురయ్యారు. డిగ్రీ విద్యార్థి అభిషేక్ ప్రాణాలు కోల్పోగా, మహమ్మద్ షానవాజ్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ‘10 నిమిషాల డెలివరీ'ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రెండు లక్షల మంది గిగ్ కార్మికులు 2025 డిసెంబర్ 31న సమ్మె చేశారు. పెన్సిల్వేనియా యూనివర్సిటీ, ‘పైగామ్’ సంస్థ 2023లో నిర్వహించిన సర్వే ఫలితాలు భయంకరంగా ఉన్నాయి. 99.3% కార్మికులకు వెన్నునొప్పి, కాలునొప్పి, నిద్రలేమి వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి.
కార్మికులు రోజుకు 12-–14 గంటలు పనిచేసి కేవలం రూ.400 –-1,000 మాత్రమే సంపాదిస్తున్నారు. ప్రమాదం జరిగినా ఆరోగ్య బీమా, ప్రమాద బీమా లేదు. అల్గారిథమ్ శిక్షల నిరంతర భయం, ఖాతా డీయాక్టివేషన్ భయం వారిని వెంటాడుతోంది. వీరి కష్టాలను గుర్తించి, తెలంగాణ ప్రతిపాదిస్తున్న ‘తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల (రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమం) చట్టం’లోని సెక్షన్ 12 ‘ఆటోమేటెడ్ మానిటరింగ్’ అల్గారిథమ్‌లు ఎలా పనిచేస్తాయో తెలుసుకునే హక్కు కార్మికులకు ఇస్తోంది. యూరోపియన్ యూనియన్ ఆమోదించిన ‘ప్లాట్‌ఫామ్ వర్క్ డైరెక్టివ్’ మాదిరి మానవ పర్యవేక్షణ లేకుండా తీసుకునే నిర్ణయాలను సవాలు చేసే హక్కు కార్మికులకు ఉండాలి.
కంపెనీలు జవాబుదారీగా ఉండాలి
ఆర్డర్ ఆలస్యమైందని అల్గారిథమ్ ఒక వర్కర్ ఐడీని బ్లాక్ చేయడం, వారికి ఇన్సెంటివ్ తగ్గించడం వంటివి చేయకూడదు. కార్మికులను పని నుంచి ఎందుకు తొలగించారు, వారికి రేటింగ్ ఎందుకు తగ్గింది వంటి విషయాలపై కంపెనీలు జవాబుదారీగా ఉండాలి. నవంబరు 2025 నుంచి అమలులోకి వచ్చిన ' సోషల్ సెక్యూరిటీ కోడ్, 2020' ప్రకారం కంపెనీలు తమ వార్షిక టర్నోవర్‌లో 1 –- 2 శాతం, లేదా కార్మికులకు చెల్లించే మొత్తంలో 5 శాతం లోపు - ప్రభుత్వ సామాజిక భద్రతా నిధికి జమ చేయాల్సి ఉంటుంది. ఈ నిధి ద్వారా గిగ్ వర్కర్ల కోసం జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య, ప్రసూతి ప్రయోజనాలు, వృద్ధాప్య రక్షణ, పిల్లల కోసం క్రెచ్ వంటి సమగ్ర సంక్షేమ పథకాలను రూపొందిస్తారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం సంక్షేమ నిధి నుంచి సాయం అందడానికి సమయం పట్టవచ్చు. కానీ, ప్రమాదం జరిగిన వెంటనే వైద్యం అందడం ముఖ్యం. కంపెనీలు వర్కర్‌కు తక్షణ ఆరోగ్య బీమా వర్తించేలా చూడాలి.
10 నిమిషాల డెలివరీపై నిషేధం
ప్రమాదం జరిగిన తర్వాత ఆదుకోవడం మాత్రమే కాదు, ప్రమాదం జరగకుండా నివారించడం కూడా చట్టం బాధ్యత. 10 నిమిషాల్లో డెలివరీ అనే నినాదం కార్మికులపై తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడిని పెంచుతోంది. ఈ మార్కెటింగ్ వ్యూహాలు పరోక్షంగా వారిని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేలా, ప్రాణాలకు తెగించి బండి నడిపేలా చేస్తున్నాయి. మానవ హక్కుల కోణంలో చూస్తే ఇది జీవించే హక్కుకు భంగం కలిగించడమే. కార్మికుల భద్రతను ప్రమాదంలోకి నెట్టే ఇలాంటి దూకుడు మార్కెటింగ్ వ్యూహాలను నియంత్రించే అధికారం ఈ చట్టం ద్వారా ప్రభుత్వానికి ఉండాలి.
వినియోగదారుల బాధ్యత
కార్మికులు రోడ్లపైనేగాక వినియోగదారుల ఇళ్లల్లో కూడా తమ ప్రాణాలను పణంగా పెడతారు. 2023లో హైదరాబాద్‌లో ఒక వినియోగదారుని ఇంటి కుక్క నుంచి తప్పించుకోవడానికి డెలివరీ కార్మికుడు మొహమ్మద్ రిజ్వాన్ మూడవ అంతస్తు నుంచి దూకి మరణించాడు. గిగ్ వర్కర్ల భద్రత వినియోగదారుల బాధ్యత కూడా. ప్రమాదకరమైన పరిస్థితులు (వెలుతురు, లిఫ్టు లేని భవనాలు , కట్టివేయని కుక్కలు) ఉన్నప్పుడు యాప్ ద్వారా ముందుగానే ఆ సమాచారం ఇవ్వాల్సిన చట్టపరమైన బాధ్యత వినియోగదారులపై ఉండాలి. ఆ డెలివరీని నిరాకరించే హక్కు వర్కర్‌కు ఉండాలి. చట్టాలకు అతీతంగా సమాజం కూడా వారి పట్ల తమ దృక్పథాన్ని మార్చుకోవాలి. డెలివరీ ఇవ్వడానికి ఇంటి గడప దాకా వచ్చిన సిబ్బంది ఎవరో కాదు, మన దేశ భవిష్యత్తైన యువతే.
శ్రమ వెనక ఆత్మగౌరవం
పెరుగుతున్న నిరుద్యోగం కారణంగా వేరే దారి లేక, కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుని ఈ కష్టమైన పనిని ఎంచుకున్న విద్యావంతులు వారు. ఎండనక, వాననక వారుపడే శ్రమ వెనక వారి ఆత్మగౌరవం, తమ కాళ్లపై తాము నిలబడాలనే పట్టుదల దాగి ఉన్నాయి. వారి పట్ల గౌరవం, కనీస మానవత్వం చూపడం మన బాధ్యత. డెలివరీకి వచ్చినప్పుడు వారిని గేటు బయట గంటల తరబడి నిలబెట్టకుండా, మనమే నాలుగు అడుగులు ముందుకేసి డెలివరీని స్వీకరించడం, వస్తువు చేతికి అందగానే చిరునవ్వుతో చెప్పే ఒక చిన్న 'థాంక్స్' వారి అలసటను మరిపిస్తుంది. చట్టాలు వారికి 'సామాజిక భద్రత'ను ఇస్తే, తోటి మనుషులుగా మనం ఇచ్చే గౌరవం వారికి 'మానసిక భరోసా'ను ఇస్తుంది.
శ్రీనివాస్ మాధవ్,
సమాచార హక్కు పరిశోధకుడు
