
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ బృందం గురువారం (జులై 24) కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో భేటీ ముగిసింది. రాష్ట్రంలో కులగణన జరిగిన తీరును, బీసీ బిల్లుకు సంబంధించిన ఆర్డినెన్స్ గురించి సీఎం రేవంత్ వివరించారు. గురువారం ఉదయం జరిగిన ఈ భేటీలో సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కులగణన, బీసీ కోటా బిల్లు, రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల గురించి ఢిల్లీ పెద్దలకు వివరించారు.
బీసీ బిల్లు అమలయ్యేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సి అనివార్యతను ఈ సందర్భంగా సీఎం రేవంత్ బృందం వివరించింది. ఈ సందర్భంగా ముఖ్యంగా కులగణన తీరుతెన్నులపై రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు. ఏ ఏ కులాలు ఎంత శాతం ఉన్నాయో అడిగారు. ఎస్సీ, ఎస్టీ జనాభా ఎంత ఉందో ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. కులగణన విధానంపై పూర్తిగా సమాచారం తీసుకున్నారు రాహుల్ గాంధీ.
కేంద్రం ఒప్పుకోకపోతే దేశవ్యాప్త ఆందోళన: పీసీసీ చీఫ్
ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన బీసీ బిల్లు ఆర్డినెన్స్ ను కేంద్రం ఒప్పుకోకపోతే దేశ వ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. బీసీ బిల్లుపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని అన్నారు. అసెంబ్లీలో ఓటేసిన బీజేపీ.. ఇప్పుడు మెలిక పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విషయంలో రాంచందర్ రావు స్టేట్ మెంట్.. బీసీలకు వ్యతిరేకం అని చెప్పకనే చెబుతోందని అన్నారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా బీసీలకు అన్యాం చేసిందని అన్నారు. బీఆర్ఎస్ 33 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో తగ్గించి మోసం చేశారని విమర్శించారు.