కేంద్రం, గుజరాత్ కలిసి లాక్కుని పోయినయ్ : మంత్రి శ్రీధర్ బాబు

కేంద్రం, గుజరాత్ కలిసి  లాక్కుని పోయినయ్ : మంత్రి శ్రీధర్ బాబు
  • కేన్స్ కంపెనీ తరలిపోవడంలో ప్రభుత్వ వైఫల్యం లేదు: మంత్రి శ్రీధర్ బాబు
  • కేటీఆర్ వి నిరాధార ఆరోపణలు అని విమర్శ

హైదరాబాద్, వెలుగు: కేన్స్ సెమీ కండక్టర్ కంపెనీ తరలిపోవడంపై కేటీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్​ బాబు ఆరోపించారు. ఆ సంస్థ ఇక్కడి నుంచి వెళ్లిపోయింది అనడంకంటే కేంద్రం, గుజరాత్​లోని బీజేపీ ప్రభుత్వాలు కలిసి లాక్కుపోయాయని చెప్పడం బాగుంటుందన్నారు. ఈ విషయం కేటీఆర్​కు తెలిసినా.. ప్రజలను మభ్యపెట్టడానికే ప్రభుత్వ వైఫల్యంతోనే ఆ కంపెనీ గుజరాత్​కు వెళ్లిందంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మంగళవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి హైదరాబాద్ లో కూర్చుని రోజూ ఏదో ఒక అంశంపై గోబెల్స్ ప్రచారం చేయడం బీఆర్ఎస్ నేతలకు అలవాటే అని పేర్కొన్నారు. ప్రజలు ఏం చెప్పినా నమ్ముతారని ఇంకా అనుకోవడం వాళ్ల భ్రమ అని విమర్శించారు. 

ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్​ఎం) కింద గుజరాత్​లోని సనంద్​లో ప్లాంట్ ఏర్పాటుకు ప్రాజెక్టు ఖర్చులో 50 శాతం సబ్సిడీ ఇవ్వడానికి కేంద్రం ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. దీంతో సహజంగానే ఆ కంపెనీ గుజరాత్​కు వెళ్లిందని తెలిపారు. కేన్స్ సెమీకాన్​ ప్రాజెక్ట్ ఖర్చు రూ.3,307 కోట్లు అయితే.. అందులో సబ్సిడీ కింద కేంద్ర ప్రభుత్వం రూ.1,653.45 కోట్లు ఇస్తుందని చెప్పారు. దాంతోపాటు గుజరాత్ ప్రభుత్వం ప్రోత్సాహకాల కింద కేంద్రం ఇచ్చే సబ్సిడీలో 40 శాతం అంటే రూ.661 కోట్లను ఇస్తుందని తెలిపారు. 

అంటే ప్రాజెక్టు మొత్తం ఖర్చులో దాదాపు 70 శాతం (రూ.2,314.9 కోట్లు) సబ్సిడీ లభిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వ పాలసీ ప్రకారం రూ.330 కోట్ల రాయితీలు లభిస్తాయన్నారు. ఐఎస్​ఎం కింద కేంద్రం 50 శాతం సబ్సిడీ ఇవ్వాల్సి ఉన్నా.. తెలంగాణ వంటి రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. కేంద్రంపై విమర్శలు చేయకుండా కాంగ్రెస్​ సర్కారుపై బీఆర్ఎస్ పడి ఏడుస్తున్నదని విమర్శించారు. బీజేపీని విమర్శించే ధైర్యంలేకనే కాంగ్రెస్​పై నిరాధార ఆరోపణలు చేస్తున్నదని మండిపడ్డారు.