రెండో రోజు రాజపుష్ప ప్రాపర్టీస్ కంపెనీల్లో ఐటీ సోదాలు

రెండో రోజు రాజపుష్ప ప్రాపర్టీస్ కంపెనీల్లో ఐటీ సోదాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఫ్యామిలీకి చెందిన రాజపుష్ప ప్రాపర్టీస్ కంపెనీలో ఇన్ కమ్ ట్యాక్స్ (ఐటీ) డిపార్ట్ మెంట్ అధికారులు రెండో రోజు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. రాజపుష్ప ప్రాపర్టీస్ కంపెనీతో పాటు వెర్టెక్స్, ముప్పా రియల్ ఎస్టేట్ సంస్థలు, వసుధ ఫార్మా  కంపెనీ ప్రధాన కార్యాలయం, డైరెక్టర్ల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

ముప్పా ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో 2వ రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ముప్పా మెలోడీస్ పేరుతో ముప్పా ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తెల్లాపూర్ లో భారీ ప్రాజెక్ట్ కొనసాగిస్తోంది. ఇప్పటికే పలు ప్రాజెక్టులను ముప్పా పూర్తి చేసింది. ఐదేళ్ల ఐటీ రిటర్న్స్ తో పాటు జీఎస్టీ చెల్లింపులపైనా ఐటీశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. CRPF బలగాలు మధ్య  సోదాలు కొనసాగుతున్నాయి. 

నిన్న కీలక పత్రాలు స్వాధీనం 

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ లోని రాజపుష్ప లైఫ్ స్టైల్ విల్లాస్ లో ఉంటున్న కంపెనీ డైరెక్టర్లు పి. శ్రీనివాస్ రెడ్డి, జయచంద్రారెడ్డి, చరణ్ రాజ్, ఎండీ మహేందర్ రెడ్డి, అడిషనల్ డైరెక్టర్ సుజిత్ రెడ్డితో పాటు అకౌంటెంట్స్, సిబ్బంది ఇండ్లల్లో ఒకేసారి తనిఖీలు నిర్వహించారు. ఇదే విల్లాస్ లో ఉంటున్న వెంకట్రామిరెడ్డి ఇంట్లోనూ సోదాలు చేశారు. రాజపుష్ప ప్రాపర్టీస్ కు చెందిన దాదాపు 15 ప్రాంతాల్లో నిన్న ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ సోదాలు నిర్వహించారు. 

రియల్ ఎస్టేట్ లో రాజపుష్ప కంపెనీ పెట్టుబడులు, ఐటీ చెల్లింపులపై అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రాజపుష్ప పలు సంస్థలతో ల్యాండ్ డెవలప్ మెంట్ అగ్రిమెంట్లు చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో రాజపుష్పతో పాటు ముప్పా , వెర్టెక్స్ కన్ స్ట్రక్షన్స్, వసుధ ఫార్మా  కంపెనీల్లోనూ సోదాలు జరిపారు.