వంద కోట్లకుపైగా ఐటీ రీఫండ్ స్కామ్

వంద కోట్లకుపైగా ఐటీ రీఫండ్ స్కామ్
  • 10% కమీషన్‌‌తో ఐటీ సేవల దందా
  • రిటర్స్, పన్ను మినహాయింపులకు ఫేక్ డాక్యుమెంట్స్
  • ట్యాక్స్ కన్సల్టెన్సీల ఘరానా మోసం

హైదరాబాద్, వెలుగు: ఇన్‌‌కం ట్యాక్స్‌‌ రీఫండ్‌‌  స్కామ్‌‌లో ఐటీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్‌‌లో ఎనిమిది ట్యాక్స్ కన్సల్టెన్సీలు, ఏపీలోని విజయవాడ, విశాఖ, తిరుపతి, గుంటూరు జిల్లాలోని ఎనిమిది కన్సల్టెన్సీలు, నిర్వాహకుల ఇండ్లలో శుక్రవారం సోదాలు జరిపారు. రూ.80 కోట్ల స్కామ్‌‌ జరిగినట్లు ఇప్పటికే ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ట్యాక్స్ కన్సల్టెన్సీల నుంచి రూ.100 కోట్లకు పైగా స్కామ్‌‌ జరిగినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లతో ట్యాక్స్‌‌ మినహాయింపులు, ఐటీ రిటర్నులతో ట్యాక్స్  కన్సల్టెన్సీలు రూ.40 కోట్ల రీఫండ్‌‌ మోసాలకు పాల్పడిన విషయం తెలిసిందే. 

ఈ కేసులో బుధవారం నుంచి ఐటీ అధికారులు దర్యాప్తు  చేస్తున్నారు. ఈ స్కామ్​లో సాఫ్ట్‌‌వేర్, ప్రైవేటు ఉద్యోగులతో పాటు రైల్వే, పోలీస్‌‌  డిపార్ట్‌‌మెంట్‌‌కు చెందిన వారు అధికంగా ఉన్నట్లు సమాచారం. గత మూడు రోజులుగా ఎల్బీ నగర్‌‌,  వనస్థలిపురం, నిజాంపేట, కూకట్‌‌పల్లి, అమీర్‌‌‌‌పేట్‌‌లోని ఎనిమిది కన్సల్టెన్సీల్లో సోదాలు చేస్తున్నారు. ఐటీ రీఫండ్  చేసేందుకు కన్సల్టెంట్లు, ఏజెంట్లు10 శాతం కమీషన్ పొందినట్లు అధికారులు గుర్తించారు. ఇన్సూరెన్స్‌‌లు, ఎడ్యుకేషన్‌‌ లోన్లు, ఇండ్లు, వృద్ధులైన తల్లిదండ్రులకు వైద్య ఖర్చుల పేరుతో నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్‌‌ చేసినట్లు ఆధారాలు సేకరించారు. ఇందుకు సంబంధించి డాక్యుమెంట్లు ఇష్యూ చేసిన కన్సల్టెన్సీలను గుర్తించినట్లు సమాచారం. సోదాలు మరో రెండు రోజుల కొనసాగే  అవకాశం ఉంది. తాము స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా సంబంధిత వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఐటీ ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.