మల్లారెడ్డి నివాసంలో కొనసాగుతున్న ఐటీ సోదాలు

మల్లారెడ్డి నివాసంలో కొనసాగుతున్న ఐటీ సోదాలు

హైదరాబాద్ : మంత్రి మల్లారెడ్డి నివాసంలో ఐటీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేత ఫిర్యాదులు రావడంతో స్పందించిన ఐటీ అధికారులు రైడ్స్ నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన కొడుకులు మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, వియ్యంకుడు లక్ష్మా రెడ్డి, సోదరుడు గోపాల్ రెడ్డి నివాసాల్లోనూ అధికారులు బృందాలుగా ఏర్పడి సోదాలు చేస్తున్నారు. మల్లారెడ్డికి చెందిన పలు విద్యా సంస్థల్లోనూ అధికారుల తనిఖీ కొనసాగుతోంది. దాదాపు 400 మంది ఐటీ ఆఫీసర్లు 65 బృందాలుగా ఏర్పడి సోదాలు చేపట్టారు. 

మల్లారెడ్డి గత 10ఏండ్లుగా చెల్లించిన ఐటీ రిటర్న్స్ పై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో రూ.4 కోట్ల నగదుతో పాటు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. రేపటి వరకు సోదాలు కొనసాగే సూచనలు ఉన్నాయి. ఐటీ దాడుల నేపథ్యంలో మల్లారెడ్డి ఇంటి వద్ద ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. దీంతో బయటకు వచ్చిన ఆయన.. అనుచరులను వెళ్లిపోవాలని కోరారు. దీంతో కార్యకర్తలు ఆందోళన విరమించి వెళ్లిపోయారు.