మల్లారెడ్డి సన్నిహితుడు సంతోష్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు

మల్లారెడ్డి సన్నిహితుడు సంతోష్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు

మంత్రి మల్లారెడ్డి ఇల్లు, యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీల్లో ఉదయం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కొంపల్లిలోని బొబ్బిలి ఎంపైర్ అపార్ట్మెంట్స్ లో నివాసం ఉంటున్న మల్లారెడ్డి సన్నిహితుడు సంతోష్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి ఐటీ అధికారులు సంతోష్ రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వారు తలుపులు తెరిచేందుకు నిరాకరించారు. దీంతో మధ్యాహ్నం తలుపులు పగలగొట్టే ప్రయత్నం చేయడంతో.. సంతోష్ రెడ్డి కుటుంబసభ్యులు తలుపులు తెరిచారు. ప్రస్తుతం సంతోష్ ఇంట్లో ఐడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. 

మల్లారెడ్డికి మద్దతుగా కార్యకర్తల నినాదాలు

సోదాల కారణంగా మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా ఇంటి నుంచి బయటకు రాలేదు. దాదాపు 10 గంటలకు పైగా ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లో 50 చోట్ల ఐటీశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి కూతురు, కొడుకులు, అల్లుళ్ల నివాసాలతో పాటు .. మల్లారెడ్డి తమ్ముళ్లు, బంధువుల ఇండ్లల్లోనూ సోదాలు చేస్తున్నారు. సాయంత్రం తర్వాత బయటికి వచ్చిన మల్లారెడ్డి వద్దకు టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. మల్లారెడ్డిగా మద్దతుగా నినాదాలు చేశారు. 

త్రిశూల్ రెడ్డి ఇంట్లో  రెండు కోట్లు సీజ్

మల్లారెడ్డి సమీప బంధువు త్రిశూల్ రెడ్డి ఇంట్లో  రెండు కోట్ల రూపాయల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. సుచిత్రలో నివాసం ఉంటున్న త్రశూల్ రెడ్డి ఇంట్లో ఉదయం నుంచి ఐటీ దాడులు జరుగుతున్నాయి.  త్రిశూల్ రెడ్డి కూడా కాలేజీలు నడుపుతున్నట్లు సమాచారం. మంత్రి మల్లారెడ్డి నివాసంలో ఐటీ సోదాల్లో సేకరించిన సమాచారంతో అధికారులు.. క్రాంతి బ్యాంక్ ఛైర్మన్ ఇంట్లో తనిఖీలు చేశారు. బాలానగర్ రాజు కాలనీలోని క్రాంతి బ్యాంక్ ఛైర్మన్ రాజేశ్వర్ రావు ఇంట్లో సోదాలు జరిపారు. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ను క్రాంతి బ్యాంక్ లో గుర్తించి సోదాలు చేసినట్లు తెలిసింది.