అతని ఇళ్లన్ని నోట్ల కట్టలతో నిండిపోయాయి.. బ్యాంకుల దగ్గర కూడా అంత లేదు

అతని ఇళ్లన్ని నోట్ల కట్టలతో నిండిపోయాయి.. బ్యాంకుల దగ్గర కూడా అంత లేదు

కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహూకు సంబంధించిన ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) దాడులు సోమవారం (డిసెంబర్ 11) 6వ రోజుకు చేరాయి. ఇప్పటివరకు రూ.355 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది ఐటీశాఖ. ఇలా ఒకే దాడిలో ఇంత పెద్ద మొత్తం దొరకడం దేశంలో ఇదే మొదటిసారని ఐటీ అధికారులు చెబుతున్నారు. 

ఎంపీ ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్న 176 బస్తాల నోట్ల కట్టలను మొత్తం 50 మంది సిబ్బంది 40 మెషిన్లతో లెక్కించారు.  పన్ను ఎగవేత ఆరోపణలపై ఒడిశాకు చెందిన డిస్టిలరీ గ్రూప్‌పై జరిగిన వరుస దాడుల్లో ఆదాయపు పన్ను శాఖ ఇప్పటివరకు రూ.355 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని 9 చోట్ల దాడులు చేశారు. రాంచీలోని సాహు ఇంట్లో నగదు లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన 50 మందికి పైగా ఉద్యోగులు 25 కంటే ఎక్కువ యంత్రాలను ఉపయోగించి రికవరీ చేసిన నగదును లెక్కించారు. కౌంటింగ్ సమయంలో ఓవర్ హీట్ కారణంగా కొన్ని యంత్రాలు పని చేయడం ఆగిపోయాయి. అంతకుముందు 2019లో కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహూకు చెందిన కాన్పూర్ జీఎస్టీ దాడిలో రూ.257 కోట్లు దొరికాయి.

ప్రస్తుతం రికవరీ చేసిన నగదు, నగలు, ఆస్తులకు సంబంధించిన సరైన వివరాలు ఇవ్వకుంటే..వాటిని  సీజ్ చేసి బ్యాంకులో జమ చేయనున్నారు. రాంచీలో కౌంటింగ్ పూర్తైన తర్వాత ఆదాయపు పన్ను శాఖ సాహును విచారించనుంది. సాహు కుటుంబ సభ్యుల నుంచి కూడా చాలా నగదు దొరికినందున, అధికారులు వారికి విచారణ నోటీసు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకోనున్నారు. 

మరోవైపు పట్టుబడిన మొత్తం ధనాన్ని అధికారులు ఒకే బ్యాంక్‌లో డిపాజిట్‌ చేయనున్నారు. దాడుల్లో ఇప్పటి వరకూ పట్టుబడిన ఈ మొత్తం సొమ్మును బలంగీర్‌లోని ఎస్‌బీఐ ప్రధాన శాఖలో డిపాజిట్‌ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎస్‌బీఐ రీజినల్‌ మేనేజర్‌ భగత్‌ బెహరా మాట్లాడుతూ.. తమకు మొత్తం 176 బ్యాగులు అందినట్లు చెప్పారు. ఇప్పటివరకూ 140 బ్యాగుల్లోని మొత్తాన్ని లెక్కించినట్టు చెప్పారు. 

మిగిలిన బ్యాగుల్లోని నగదును నేడు లెక్కించనున్నట్లు వివరించారు. మొత్తం మూడు బ్యాంకులకు సంబంధించిన అధికారులు ఈ కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొంటున్నారని చెప్పారు.  సుమారు 40 లెక్కింపు యంత్రాలను తీసుకొచ్చినట్లు తెలిపారు. అందులో 25 మెషీన్లను వినియోగిస్తున్నామని.. మరో 15 బ్యాకప్‌గా ఉంచినట్టు ఆయన వివరించారు.