మాల్స్​పై  ఐటీ రెయిడ్స్.. 35 ప్రాంతాల్లో  ఆకస్మిక తనిఖీలు 

మాల్స్​పై  ఐటీ రెయిడ్స్.. 35 ప్రాంతాల్లో  ఆకస్మిక తనిఖీలు 

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రముఖ వస్త్ర వ్యాపార సం స్థలపై ఐటీ డిపార్ట్‌‌మెంట్‌‌ దృష్టి పెట్టింది. ఏపీ, కర్నాటక, హైదరాబాద్‌‌లోని సుమారు 35 ప్రాంతాల్లో మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేసింది. ఐటీ చెల్లింపుల్లో తేడాలు గుర్తించిన అధికారులు.. కళామందిర్‌‌ అనుబంధ సంస్థలు, కేఎల్‌‌ఎమ్‌‌, కాంచీపురం వర మహాలక్ష్మీ షాపింగ్‌‌ మాల్స్‌‌, గోదాముల్లో సోదాలు చేశారు. జూబ్లీహిల్స్‌‌లోని రోడ్డు నంబర్ 36లోని కాంచీపురం వరమహాలక్ష్మి షాపింగ్ మాల్‌‌, బంజారాహిల్స్, మాదాపూర్‌‌‌‌, కూకట్‌‌పల్లి, గచ్చిబౌలి, కిస్మత్‌‌పురలోని ఆ సంస్థకు సంబంధించిన షాపింగ్ మాల్స్‌‌, డైరెక్టర్స్‌‌, సీఈఏ ఇతర వస్త్ర దుకాణాల్లో తనిఖీలు చేశారు.

ఐదు రోజుల సెర్చ్‌‌ వారెంట్‌‌తో సోదాలు

ఐదు రోజుల సెర్చ్‌‌ వారెంట్‌‌తో సోదాలు చేస్తున్నట్లు తెలిసింది. మంగళవారం తెల్లవారుజామున 6 గంటల నుంచి 20 టీమ్స్‌‌ సోదాలు ప్రారంభించాయి. షాపింగ్ మాల్స్‌‌, గోదాముల్లో అకౌంట్స్‌‌ సిబ్బందిని మినహా ఇతరులను అనుమతించలేదు. అసిస్టెంట్ కమిషనర్ హోదా అధికారుల  ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. కంపెనీలకు చెందిన ఫైనాన్సియల్ రికార్డ్స్‌‌, హార్డ్‌‌డిస్క్‌‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఐదేండ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్‌‌, రోజువారి ఆర్థిక లావాదేవీల బ్యాలెన్స్ షీట్స్‌‌ను పరిశీలించినట్లు సమాచారం.

ఐటీ చెల్లింపుల్లో తేడాలు..!

అనుమానాస్పద  లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను తమకు అందించాలని ఆదేశించినట్లు తెలిసింది. గోదాముల్లో స్టాక్‌‌తో పాటు ప్రతి ఏటా ఆదాయ వ్యయాలకు సంబంధించిన రికార్డ్‌‌లను పరిశీలించినట్లు సమాచారం. సోదాలు చేస్తున్న సమయాల్లో షాపింగ్ మాల్స్‌‌లో కస్టమర్లకు ఎలాంటి ఆటంకం కలిగించలేదు. రెగ్యులర్‌‌‌‌గా జరిగే ఆర్థిక లావాదేవీలను కొనసాగించారు. ఐటీ అధికారులు సెర్చ్‌‌ చేస్తున్న ప్రదేశాల్లోకి ఎవ్వరినీ అనుమతించలేదు. మాల్‌‌ మేనేజర్‌‌‌‌, అకౌంట్స్‌‌ సిబ్బందితో కలిసి రోజువారి సేల్స్, ఇన్‌‌కమ్‌‌, ఇతర ఖర్చులకు సంబంధించిన వివరాలను రికార్డ్‌‌ చేసినట్లు తెలిసింది. సోదాలు బుధవారం కూడా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.