వారసుడి ఎంట్రీపై మజ్లిస్ యూటర్న్!

వారసుడి ఎంట్రీపై మజ్లిస్ యూటర్న్!

హైదరాబాద్,వెలుగు: పాలిటిక్స్​లోకి వారసుడి ఎంట్రీపై మజ్లిస్ యూటర్న్ తీసుకున్నట్లు సమాచారం. బహదూర్​పురా అభ్యర్థిగా పార్టీ శాస్ర్తిపురం కార్పొరేటర్​ మహ్మద్​ మోబిన్​ను అధినేత అసదుద్దీన్​ఓవైసీ గురువారం ఖరారు చేశారు. కాగా.. వారసుడిని రాజకీయాల్లోకి తీసుకు రావాలనే ప్రయత్నానికి తాత్కాలికంగా ఫుల్ స్టాప్​పెట్టారు. ముందుగా మజ్లిస్ మరో నేత అక్బరుద్దీన్ ​ఓవైసీ కొడుకు నూరుద్దీన్​ఓవైసీని చార్మినార్ లేదంటే బహదూర్​పురా నుంచి అభ్యర్థిగా ప్రకటించాలని భావించారు. 

దీంతో పార్టీ సీనియర్​ఎమ్మెల్యే ముంతాజ్​ఖాన్​కు టికెట్ ​నిరాకరించారు. అయితే.. వారసుడి ఎంట్రీపై ఓవైసీ బ్రదర్స్ మధ్య కొంత బేధాభిప్రాయాలు వచ్చినట్లు ప్రచారం జరిగింది. దీంతో బహదూర్​పురా, చార్మినార్ అభ్యర్థుల ప్రకటన ఆలస్యమైంది. ఇప్పట్లో వారసుడిని పోటీకి దింపకూడదని ఓవైసీ సోదరులు నిర్ణయించుకోవడంతో చివరకు బహదూర్​పురా టికెట్​ను కార్పొరేటర్​మహమ్మద్ ​మోబిన్​కు కేటాయించారు.  2002లో ఆగాపురా డివిజన్ ​నుంచి, 2009,2015 ఎన్నికల్లో రామ్నాస్​​పురా నుంచి కార్పొరేటర్​గా మహ్మద్​ మోబిన్ గెలుపొందారు. 2020 జరిగిన బల్దియా ఎన్నికల్లో శాస్ర్తిపురం డివిజన్​ నుంచి పోటీ చేసి కార్పొరేటర్​గా విజయం సాధించారు. 

చార్మినార్​పై మజ్లిస్​లో వీడని ఉత్కంఠ.. కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు

చార్మినార్ సెగ్మెంట్​కు అభ్యర్థిని పేరును మజ్లిస్ ఇంకా ప్రకటించలేదు. ఈ సెగ్మెంట్​ను పెండింగ్​లో పెట్టడంతో తనకు టికెట్ దక్కదేమోనని సిట్టింగ్ ఎమ్మెల్యే, మజ్లిస్ సీనియర్ నేత ముంతాజ్​ఖాన్​కు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.  టికెట్ రాకుంటే  ఇండిపెండెంట్​పోటీ చేస్తానని స్పష్టం చేశారు. దీంతో ఓల్డ్ సిటీలో  పాగా వేసేందుకు కాంగ్రెస్​ దృష్టి పెట్టింది. మజ్లిస్​లోని వర్గపోరును తమకు అనుకూలంగా మార్చుకోవాలని నిర్ణయించింది. 

ఇందులో భాగంగా కొన్ని రోజులుగాముంతాజ్​ఖాన్​తో మంతనాలు చేసింది. ఆయన కాంగ్రెస్​లో చేరితే చార్మినార్​ అభ్యర్థిగా ప్రకటిస్తామని ఆఫర్​ఇచ్చింది. ముంతాజ్​ను ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయితే,  చర్చలు జరుగుతుండగానే కాంగ్రెస్ గురువారం రిలీజ్​ చేసిన ఫైనల్ లిస్ట్​లో చార్మినార్ అభ్యర్థిగా మహ్మద్​ ముజీబ్​ పేరును ప్రకటించింది.