- ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్, విప్రో షేర్లు 6 శాతం వరకు పతనం
- ఏఐతో ఐటీ కంపెనీల రెవెన్యూ పడిపోతుందనే భయాలు
- ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చని ఇన్వెస్టర్ల ఆందోళన
ముంబై: వరుస సెషన్లలో లాభాల్లో కదిలిన బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లకు గురువారం ఐటీ షేర్లు పెద్ద షాకిచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీల రెవెన్యూ సగటున 10–13 శాతం మేర పడిపోతాయని రిపోర్ట్స్ వెలువడుతుండడం ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. దీంతో పాటు ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చనే అంచనాలు, హెచ్1బీ వీసాను పూర్తిగా రద్దు చేసే బిల్లును యూఎస్ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టడం వంటి అంశాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
నిఫ్టీ ఐటీ ఇండెక్స్ గురువారం ఏకంగా 5.51 శాతం క్రాష్ అయ్యింది. ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు 6 శాతం వరకు పతనమయ్యాయి. వీటికితోడు ఇండెక్స్ హెవీ వెయిట్ రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు కూడా ఒక శాతం వరకు నష్టపోయాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం 558 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ అర శాతానికి పైగా నష్టపోయింది. సెన్సెక్స్ 83,674.92 వద్ద, నిఫ్టీ 146 పాయింట్లు తగ్గి 25,807.20 వద్ద సెటిలయ్యాయి.
మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, లార్సన్ అండ్ టూబ్రో, టాటా స్టీల్, భారతి ఎయిర్‌టెల్ ఇండెక్స్‌లకు మద్ధతుగా నిలిచాయి. ‘‘ఏఐ ఆధారిత మార్పులతో ఐటీ రంగంలో మార్జిన్లు పడిపోతాయనే భయాలు పెరిగాయి. యూఎస్ జాబ్ డేటా, నిరుద్యోగం రేట్ బలంగా ఉండడంతో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు సన్నగిల్లాయి. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు కూడా ఇన్వెస్టర్లను జాగ్రత్తగా ఉండేలా చేస్తున్నాయి” అని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ తెలిపారు.
ఎఫ్‌ఐఐలు రిటర్న్..
ఆసియా మార్కెట్లలో కొరియా కోస్పి గురువారం మూడు శాతం పెరిగింది. జపాన్ నిక్కీ, షాంఘై సూచీలు కూడా లాభపడ్డాయి. హాంకాంగ్ హాంగ్‌సెంగ్ మాత్రం నష్టపోయింది. యూరప్ మార్కెట్లు మిశ్రమంగా కదలగా, యూఎస్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) బుధవారం నికరంగా రూ.943.81 కోట్ల విలువైన షేర్లు కొనగా, గురువారం మరో రూ.108 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. బ్రెంట్ క్రూడాయిల్ ధర 0.27శాతం తగ్గి బ్యారెల్‌కు 69.21 డాలర్లకి చేరింది.
రూపాయి జూమ్
రూపాయి గురువారం డాలర్‌తో 17 పైసలు బలపడి 90.61 వద్ద ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తుండడంతో సెంటిమెంట్ మెరుగుపడింది. దీనికితోడు ఆర్‌బీఐ బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ పెంచేందుకు చర్యలు తీసుకోవడం కలిసొచ్చిందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. ఇంటర్‌బ్యాంక్ మార్కెట్‌లో రూపాయి గురువారం 90.55 వద్ద ప్రారంభమై, రోజు మధ్యలో 90.40 వరకు బలపడింది. 90.65 వరకు బలహీనపడింది. రూపాయి బుధవారం 22 పైసలు పడిపోయి 90.78 వద్ద ముగిసింది. మరోవైపు డాలర్ ఇండెక్స్ గురువారం 0.04శాతం తగ్గి 96.79 వద్ద ఉంది.
