నంబర్ వన్‌‌గా నిలుపుతం...కర్నాటక ప్రజలకు ప్రధాని మోడీ లేఖ

నంబర్ వన్‌‌గా నిలుపుతం...కర్నాటక ప్రజలకు ప్రధాని మోడీ లేఖ
  •     కన్నడిగులు నాపై చూపిన ప్రేమ అసమానం
  •     రాష్ట్రాన్ని తొలి స్థానంలో నిలపాలన్న నా సంకల్పానికి బలమిచ్చింది
  •     మనం లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే.. ప్రపంచంలోని ఏ శక్తీ ఆపలేదు
  •     ఇండియాను టాప్‌‌ 3 ఎకానమీగా నిలపడమే మన తర్వాతి టార్గెట్
  •     ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా కర్నాటక అభివృద్ధి చెందితేనే  అది సాధ్యమని ప్రధాని వ్యాఖ్య

బెంగళూరు: దేశంలో నంబర్ వన్‌‌ రాష్ట్రంగా కర్నాటకను నిలిపేందుకు ప్రజలు తమను ఆశీర్వదించాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. కర్నాటక పర్యటనల్లో ప్రజలు తనపై చూపిన ప్రేమ అసమానమని, అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని నంబర్ వన్‌‌గా నిలపాలన్న తన సంకల్పానికి బలం చేకూర్చిందని చెప్పారు. మంగళవారం ఈ మేరకు కన్నడిగులకు ప్రధాని బహిరంగ లేఖ రాశారు. దాన్ని ట్విట్టర్‌‌‌‌లో షేర్ చేశారు. ‘‘కర్నాటకలోని ప్రతి వ్యక్తి కల.. నా కల. మీ సంకల్పమే నా సంకల్పం. మనం ఒక్కచోటుకు చేరి.. లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే.. ప్రపంచంలోని ఏ శక్తీ మనల్ని ఆపలేదు” అని ట్వీట్ చేశారు. కర్నాటక భవిష్యత్తు కోసం విజ్ఞప్తి చేస్తున్నానని, ముఖ్యంగా యువ తరాల ఉజ్వల భవిష్యత్తు కోసమని చెప్పారు. ప్రజలు తనపై ప్రేమను, ఆప్యాయతను కురిపించారని, దీన్ని తాను దైవ దీవెనగా భావిస్తున్నానని ప్రధాని అన్నారు. ఈసారి మెజారిటీ బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావాలని 
ప్రజలకు పిలుపునిచ్చారు.

టాప్‌‌3 లోకి వెళ్లడమే లక్ష్యం

‘‘ప్రస్తుతం ప్రపంచంలోని ఐదో అతిపెద్ద ఎకానమీగా ఇండియా ఉంది. టాప్‌‌3 లోకి వెళ్లడమే మన తర్వాతి లక్ష్యం. ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా కర్నాటక అభివృద్ధి చెందినప్పుడే అది సాధ్యమవుతుంది” అని ప్రధాని అన్నారు. ‘‘3.5 ఏళ్లుగా రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూశారు. మా నిర్ణయాత్మక, కేంద్రీకృత, భవిష్యత్ విధానాలు కర్నాటక ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడ్డాయి” అని వివరించారు. కరోనా కల్లోలం సమయంలోనూ కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వం 99 వేల కోట్ల ఎఫ్‌‌డీఐలను రాబట్టగలిగిందని ప్రధాని అన్నారు. కానీ అంతకుముందు ప్రభుత్వం కేవలం 30 వేల కోట్లను మాత్రమే తీసుకురాగలిగిందని చెప్పారు. ‘‘ఇన్వెస్ట్‌‌మెంట్, ఇండస్ట్రీ, ఇన్నోవేషన్‌‌లో.. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్‌‌మెంట్, ఎంట్రప్రెన్యూర్‌‌‌‌షిప్‌‌లో కర్నాటకను నంబర్‌‌‌‌వన్‌‌గా చేయాలని మేం కోరుకుంటున్నాం” అని వివరించారు.

ఆధునిక కర్నాటక కోసం..

‘బీజ్ సే బజార్ తక్ (విత్తనం దగ్గర నుంచి మార్కెట్‌‌ దాకా)’ అనే విజన్‌‌తో రైతులు ఎంపవర్ చేసేందుకు, వ్యవసాయంలో రాష్ట్రాన్ని తొలిస్థానంలో నిలిపేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని, స్టోరేజ్ ఫెసిలిటీలను పెంచుతున్నామని పేర్కొన్నారు. ఇథనాల్ బ్లెండింగ్‌‌ను, నానో యూరియా వాడకాన్ని, మోడర్న్ టెక్నాలజీని పెంచుతున్నామని చెప్పారు. ‘‘కర్నాటక సాంస్కృతిక వారసత్వం దేశానికి, వ్యక్తిగతంగా నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తుంది. జగజ్జ్యోతి బసవేశ్వరుడు, నాదప్రభు కెంపెగౌడ, శ్రీ కనకదాసు, ఒనకే ఓబవ్వ.. ఇలా ఎందరో మహానుభావులను ఈ నేల మనకు అందించింది. వారి వారసత్వ మార్గనిర్దేశంలో.. వారు గర్వించేలా ఆధునిక కర్నాటకను నిర్మించేందుకు బీజేపీ కృషి చేస్తోంది” అని 
ప్రధాని నరేంద్ర మోడీ వివరించారు.