గద్వాలలో ‘కిడ్నీ’ కష్టాలు!.. పెరిగిన డయాలసిస్ రోగులు.. కేంద్రాల పెంపునకు డిమాండ్

గద్వాలలో ‘కిడ్నీ’ కష్టాలు!.. పెరిగిన డయాలసిస్ రోగులు.. కేంద్రాల పెంపునకు డిమాండ్
  • 21 మిషన్లు మాత్రమే అందుబాటులో.. మరో 13 కావాలంటున్న పేషెంట్లు
  • మూడేండ్లలో 50 నుండి 150కి చేరిన బాధితులు
  • అర్ధరాత్రి వరకు షిఫ్టుల్లో చికిత్స
  • 150 మందిలో 50 మందికే అందుతున్న పెన్షన్

గద్వాల, వెలుపు : జోగులాంబ గద్వాల జిల్లాలో డయాలసిస్ రోగుల సంఖ్య రోజురోజుకూ ఆందోళనకరంగా పెరుగుతోంది. మూడేండ్ల  కింద కేవలం 50 మంది ఉండగా,  ప్రస్తుతం గద్వాల ఆస్పత్రి రికార్డుల ప్రకారం 150కి పైగా ఉన్నారు. దీంతో యూనిట్లు తక్కువ.. పేషెంట్లు ఎక్కువ కావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 

21 యూనిట్లే ఉన్నాయి.. 

జిల్లాలో ప్రస్తుతం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రిలో 12, ఆలంపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 5, గద్వాల ప్రైవేట్ ఆస్పత్రిలో 4 కలిపి మొత్తం 21 యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే రోగుల తాకిడికి ఇవి సరిపోకపోవడంతో, వైద్య సిబ్బంది నాలుగు షిఫ్టుల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు చికిత్స అందించాల్సి వస్తోంది. పెరుగుతున్న రోగుల దృష్ట్యా జిల్లాలో డయాలసిస్ కేంద్రాలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

గద్వాల ప్రభుత్వ ఆస్పత్రిలో మరో 5 మిషిన్లు, అలంపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3 మిషిన్లు అదనంగా ఏర్పాటు చేయడంతో పాటు, అయిజలో కొత్తగా 5 మిషిన్లతో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే కొంత ఊరట లభిస్తుందని పలువురు పేషెంట్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం 30 నుండి 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గద్వాల రావాల్సి రావడం, రాత్రి సమయాల్లో చికిత్స పొందడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం పగటిపూట మాత్రమే డయాలసిస్ పూర్తయ్యేలా సౌకర్యాలు పెంచితే, ఎమర్జెన్సీ కేసుల్లో ప్రాణాపాయం తప్పుతుందని బాధితులు కోరుతున్నారు.

కొందరికే పెన్షన్.. 

ప్రభుత్వం డయాలసిస్ రోగులకు నెలకు రూ. 2 వేలు పెన్షన్ ఇస్తున్నప్పటికీ, అది అందరికీ అందడం లేదు. జిల్లాలో ఉన్న 150 మంది రోగుల్లో కేవలం 50 మంది పాతవారికి మాత్రమే పెన్షన్ అందుతుండగా, మిగతా 100 మంది కొత్త రోగులు ఏండ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. వారానికి మూడు రోజులు డయాలసిస్ చేయించుకోవాల్సి రావడం, తోడుగా కుటుంబ సభ్యులు ఉండడం వల్ల  వారి ఉపాధి దెబ్బతింటోంది. సరైన పౌష్టికాహారం తీసుకోవడానికి ఆర్థిక స్థోమత లేక బాధితులు ఇబ్బంది పడుతున్నారు. ఉచిత బస్సు పాస్ సౌకర్యం ఉన్నప్పటికీ, పెన్షన్ మొత్తాన్ని పెంచి, అర్హులైన అందరికీ వెంటనే మంజూరు చేయాలని బాధితుల కుటుంబాలు విన్నవిస్తున్నాయి.

పేషెంట్లు పెరిగారు.. కొత్త యూనిట్​ అవసరం..

జిల్లాలలో డయాలసిస్​ పేషెంట్లు పెరిగారు. ప్రస్తుతం ఉన్న మిషన్లతో షిఫ్టులవారీగా అందరికీ డయాలసిస్​చేస్తున్నాం. అయిజ ప్రాంతం నుంచి పేషెంట్లు ఎక్కువగా వస్తున్నారు. అక్కడ కొత్తగా యూనిట్ ఏర్పాటు చేస్తే పేషెంట్లకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటూ, సరైన ఆహార నియమాలు పాటిస్తే ఎన్నేండ్లయినా ఆరోగ్యంగా ఉండవచ్చు. -నర్సింహ, డయాలసిస్​ సెంటర్​ ఇన్​చార్జి, గద్వాల