ఇటలీలో భారీ దొంగతనం జరిగింది. ఏకంగా రూ.54 కోట్ల విలువైన ఖరీదైన వైన్ బాటిళ్లను దొంగల ముఠా ఎత్తుకెళ్లింది. ముఖాలకు మాస్కులు ధరించిన ఏడుగురు వ్యక్తులు పక్కా ప్లాన్‌తో ఈ దోపిడీకి పాల్పడ్డారు. సాధారణంగా దొంగలు బంగారం, నగలు, డబ్బును లక్ష్యంగా చేసుకుంటారు. కానీ ఈ ముఠా మాత్రం ఖరీదైన వైన్ బాటిళ్లపై కన్నేసింది. అది కూడా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 30 వేల బాటిళ్లను రెండు ట్రక్కుల్లో ఎక్కించుకుని పరారైంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ దొంగతనం జరిగింది 640 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రముఖ వైన్ తయారీ సంస్థకు చెందిన గోడౌన్ లో..
640 ఏళ్ల చరిత్ర.. 170 దేశాలకు వైన్ ఎగుమతి!
ఇటలీలోని ప్రముఖ వైన్ తయారీ సంస్థల్లో ఒకటైన మార్చెసి ఆంటినోరి (Marchesi Antinori) చరిత్ర 1385లో ప్రారంభమైంది. అంటే దాదాపు 640 ఏళ్లుగా ఈ సంస్థ వైన్ వ్యాపారంలో కొనసాగుతోంది. ఆంటినోరి కుటుంబం తరతరాలుగా ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ తయారు చేసే వైన్‌ను ప్రపంచవ్యాప్తంగా సుమారు 170 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. సోలాయా, టిగ్నానెల్లో, గ్వాడో అల్ టాసో వంటి ఖరీదైన వైన్లకు ఈ సంస్థ ప్రసిద్ధి చెందింది. వైన్ సేకరించేవారు, ఖరీదైన వైన్లను ఇష్టపడేవారు వీటిని ప్రత్యేకంగా కొనుగోలు చేస్తుంటారు. అలాంటి ప్రముఖ సంస్థ గిడ్డంగిలోనే భారీ దోపిడీ జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పక్కా ప్లాన్‌తో దోపిడీ.. అలారాలు నిలిపివేసి మరీ!
టస్కనీ ప్రాంతంలోని సంస్థ గిడ్డంగిలో ఈ దొంగతనం జరిగింది. వారాంతంలో గిడ్డంగిలోకి ప్రవేశించిన దొంగలు.. భద్రతా వ్యవస్థను దాటుకుని లోపలికి వెళ్లినట్లు సమాచారం. అక్కడి అలారం వ్యవస్థను నిలిపివేసి, కంపెనీకి చెందిన ఫోర్క్‌లిఫ్ట్ సాయంతో వైన్ బాటిళ్లను ట్రక్కుల్లోకి ఎక్కించారు. అనంతరం రెండు ట్రక్కులతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం ఉద్యోగులు గిడ్డంగికి చేరుకున్న తర్వాత ఈ దొంగతనం వెలుగులోకి వచ్చింది. సీసాలను ముందుగానే విదేశీ పంపిణీదారులకు పంపేందుకు ప్యాక్ చేసి ఉంచడంతో, దొంగలు తక్కువ సమయంలోనే భారీ మొత్తంలో సరుకును తరలించగలిగినట్లు తెలుస్తోంది.
ఏకంగా రూ.54 కోట్ల విలువైన బాటిళ్లు!
దొంగిలించిన సుమారు 30 వేల వైన్ బాటిళ్ల విలువ 5 మిలియన్ యూరోలు. భారత కరెన్సీలో దాదాపు రూ.54 కోట్లు. ఈ బాటిళ్లలో సంస్థకు చెందిన అత్యంత ఖరీదైన, పేరున్న వైన్ రకాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సోలాయా వైన్ బాటిళ్లు సుమారు 8 వేల నుంచి 10 వేల వరకు దొంగతనానికి గురైనట్లు సమాచారం. కొన్ని సంవత్సరాలపాటు ప్రత్యేకంగా నిల్వఉంచి తయారు చేసిన ఈ వైన్లకు మార్కెట్లో భారీ ధరలు పలుకుతాయి. అందుకే ఈ బాటిళ్లను దొంగిలించడం మాత్రమే కాదు.. వాటిని బయట మార్కెట్లో విక్రయించడం కూడా దొంగలకు పెద్ద సవాలే.
మరో వైన్ కంపెనీలోనూ దొంగతనం!
ఇటలీలో ఖరీదైన వైన్లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దొంగతనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరో ప్రముఖ వైన్ ఉత్పత్తిదారు బాన్ఫీ సంస్థ కూడా జూలైలో దొంగతనం జరిగినట్లు నివేదించింది. ఈ రెండు ఘటనలకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటివరకు వాటి మధ్య సంబంధం ఉన్నట్లు నిర్ధారణ కాలేదు.
దొంగిలించిన బాటిళ్లు ఎక్కడున్నాయి?
ప్రస్తుతం ఇటలీ పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. దొంగిలించిన వైన్ బాటిళ్లను ఎక్కడికి తరలించారు? వాటిని ఇతర దేశాలకు పంపించారా? లేక ప్రైవేటు విక్రేతల ద్వారా విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారా? అనే విషయాలను అధికారులు గుర్తించాల్సి ఉంది. మరోవైపు, అనధికార విక్రేతల నుంచి తమ వైన్ కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సంస్థ వినియోగదారులను హెచ్చరించింది.
640 ఏళ్లుగా వైన్ వ్యాపారంలో పేరుపొందిన సంస్థకు చెందిన గిడ్డంగిలో ఇంత భారీ దోపిడీ జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది. దొంగలు ఎత్తుకెళ్లిన 30 వేల బాటిళ్ల ఆచూకీ ఎక్కడ లభిస్తుంది? రూ.54 కోట్ల విలువైన ఈ సరుకును పోలీసులు తిరిగి స్వాధీనం చేసుకోగలరా? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది.
