విద్యార్థులు చదువు మీదే దృష్టి పెట్టాలి : ఐటీడీఏ పీవో బి. రాహుల్

విద్యార్థులు చదువు మీదే దృష్టి పెట్టాలి : ఐటీడీఏ పీవో బి. రాహుల్

ఖమ్మం టౌన్, వెలుగు : గిరిజన సంక్షేమ శాఖ పీఎంహెచ్ హాస్టల్ లో చదువుతున్న విద్యార్థులు చదువుతోపాటు, భవిష్యత్​లో స్థిరపడటానికి ఇప్పటి నుంచే శ్రమించాలని ఐటీడీఏ పీవో బి. రాహుల్ సూచించారు. మంగళవారం ఖమ్మం పట్టణంలోని గిరిజన సంక్షేమ శాఖ పీఎంహెచ్ వసతిగృహాన్ని ఆయన సందర్శించారు.  వసతి, ఇతర సౌకర్యాలపై స్టూడెంట్స్ ను అడిగి తెలుసుకున్నారు.

 అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టానుసారంగా బయట తిరగకుండా, చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆ తర్వాత గిరిజన భవనాన్ని సందర్శించారు.  ప్రస్తుతం ఉన్న నిధులతో భవనంలో టాయిలెట్, బాత్రూమ్స్, మంచినీటి సౌకర్యాలు ఏర్పాట్లు చేయాలని  సూచించారు. ఖమ్మం పట్టణంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు నెలకొల్పిన మహిళా మార్ట్ ను కూడా సందర్శించారు. 

అక్కడి వస్తువులు, గ్రూప్ మహిళలకు ఆదాయ మార్గాల పరిస్థితిపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఖమ్మం డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని విజయలక్ష్మి, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ నారాయణరెడ్డి, వైరా ఏటీడీవో భారతీదేవి తదితరులు పాల్గొన్నారు. 

భోజనంలో నాణ్యత పాటించాలి

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమ పాఠశాలలు, పోస్ట్ మెట్రిక్, ప్రీమెట్రిక్, గురుకులాలు, ఈఎంఆర్ఎస్ పాఠశాలల్లో గిరిజన స్టూడెంట్స్ కు అందించే అల్పాహారం, భోజనంలో నాణ్యత పాటించాలని పీవో రాహుల్ అధికారులను ఆదేశించారు. 

కల్లూరు గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలో జరిగిన పరిణామాలు ఒక హెచ్చరికగా భావించి ఇకముందు ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రిన్సిపాల్, హెచ్ఎం, వార్డెన్లపై ఉందన్నారు. కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూళ్ల  ప్రిన్సిపాల్, హెచ్ఎం. వార్డెన్ లతో ఆయన సమావేశం నిర్వహించారు. స్టూడెంట్స్​ విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.