ఆదివాసీల సమస్యల పరిష్కారానికే ఆది కర్మయోగి అభియాన్ : ఐటీడీఏ పీవో రాహుల్

ఆదివాసీల సమస్యల పరిష్కారానికే  ఆది కర్మయోగి అభియాన్ : ఐటీడీఏ పీవో రాహుల్
  • ఐటీడీఏ పీవో రాహుల్​ 

భద్రాచలం, వెలుగు :  మారుమూల ఆదివాసీల సమస్యల పరిష్కారానికే ఆది కర్మయోగి అభియాన్​ స్కీం అని ఐటీడీఏ పీవో బి.రాహుల్ అన్నారు. దుమ్ముగూడెం మండలంలోని సింగవరం, నడికుడి గ్రామాల్లో మంగళవారం ఈ స్కీం అమలులో భాగంగా ఆది సేవకేంద్రం ప్రారంభించి, గ్రామసభలో ఆదివాసీల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 2030 నాటికి ఆదివాసీలు నివాసముండే అన్ని గ్రామపంచాయతీలను అభివృద్ధి చేయడమే పథకం లక్ష్యం అని తెలిపారు. ప్రతీ గ్రామంలో వాలంటీర్​, సాథీసహయోగులను నియమించామని వివరించారు. ప్రతీ శనివారం సమావేశమై  గ్రామాలకు అవసరమయ్యే పనులను ప్రతిపాదనలు తయారు చేసుకోవాలని సూచించారు.

 ఐటీడీఏ ద్వారా అమలయ్యే సంక్షేమ పథకాలను వివరించారు. రెండు గ్రామాల్లో సీసీ రోడ్లు, త్రీఫేజ్​ కరెంట్, మంచినీటి సమస్యలను వెల్లడించారు. ఇలవేల్పుల గద్దెలను నిర్మించాలని కోరారు. చెరువులు, కాల్వలు, విద్యార్థులకు బస్సు సౌకర్యం, ఉపాధి అవకాశాలు, గిరిజన కుటుంబాలకు గుర్తింపు కార్డులు, పెన్షన్లు, చదువులకు ఆర్థికసాయం, పాఠశాల భవనాల నిర్మాణం, క్రీడామైదానాలు, క్రీడాకారులకు చేయూత, గ్రంథాలయాల ఏర్పాటు, అటవీ భూములకు ఆర్​ఓఎఫ్​ఆర్​ పట్టాలు, కరెంట్​ మోటార్లు తదితర సమస్యలను ఆదివాసీలు మొరపెట్టుకున్నారు. 

అబ్జర్వర్​ ప్రదీప్​కుమార్​ సింగ్​ మాట్లాడుతూ 2030 నాటికి అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తెప్పిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు ఆదివాసీలు పీవో, అబ్జర్వర్​, ఇతర అధికారులకు బతుకమ్మలతో స్వాగతం పలికారు. గ్రామంలోని ఇలవేల్పులకు పూజలు చేశారు. స్థానిక యువకులు ఆఫీసర్లతో వాలీబాల్​ఆడారు. ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం తహసీల్దారు అశోక్​కుమార్, ఎంపీవో రామకృష్ణ, డీఎంటీలు రాంబాబు, మధువన్, జగదీశ్​ 
తదితరులు పాల్గొన్నారు.