118 జీవో గైడ్​లైన్స్ ఇంకా రాలే!

118 జీవో గైడ్​లైన్స్ ఇంకా రాలే!

వచ్చేదాక దరఖాస్తు చేసుకునేందుకు నో చాన్స్

  • మొత్తం 6 నియోజకవర్గాల్లో 15 వేల మందికి పైగా లబ్ధిదారులు
  • ఒక్క ఎల్ బీనగర్​ పరిధిలోనే 10 వేల మంది 
  • జీవో వచ్చిందని తెలిసి రెవెన్యూ ఆఫీసులకు లబ్ధిదారుల పరుగులు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​లోని ఆరు నియోజకవర్గాల పరిధిలో నిషేధిత జాబితాలో ఉన్న భూముల రెగ్యులరైజేషన్​కు సంబంధించి 118 జీవో వచ్చి వారం రోజులు అవుతోంది. కానీ ప్రభుత్వం ఇంత వరకు గైడ్​లైన్స్ ఇవ్వలేదు. బుధవారం సరూర్ నగర్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ 118 జీవో గురించి ప్రస్తావించి, జీవో పత్రాలను స్థానిక ఎమ్మెల్యేలకు అందజేశారు. దీంతో లబ్ధిదారులు గురువారం రెవెన్యూ ఆఫీసులకు పరుగులు తీశారు. అయితే రెగ్యులరైజేషన్​కు సంబంధించి ప్రభుత్వం నుంచి తమకు ఇంకా ఎలాంటి గైడ్ లైన్స్ రాలేవని ఆఫీసర్లు తెలిపారు. వచ్చిన తర్వాతే ఎలా అప్లయ్ చేసుకోవాలనే దానిపై క్లారిటీ ఇస్తామన్నారు. ఎల్​బీనగర్, కార్వాన్, జూబ్లీహిల్స్, నాంపల్లి, మేడ్చల్, 
రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లోని 44 కాలనీల్లోని భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయి. వీటికి రిజిస్ట్రేషన్లు మొదలైతే 15 వేల మందికి పైగా లబ్ధి చేకూరనుంది. ఇందులో ఒక్క ఎల్ బీనగర్ నియోజకవర్గంలోనే దాదాపు10 వేల మంది ఉన్నారు. 15 ఏండ్ల తర్వాత పట్టాలు అందుతుండడంతో లబ్ధిదారులు ఆనందరం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే గైడ్​లైన్స్​ఇచ్చి ప్రక్రియను మొదలుపెట్టాలని కోరుతున్నారు. మళ్లీ ఏదో ఒక కారణం చూపి ముందుకు జరపకుండా పట్టాలు అందిస్తే బాగుంటుందని అంటున్నారు.

 ఇవే ఆ 44 కాలనీలు..

ఎల్​బీనగర్ నియోజకవర్గం సరూర్ నగర్ మండలంలోని మాధవ నగర్, శ్రీదేవి కాలనీ, జనార్దన్ రెడ్డి నగర్ కాలనీ, మల్లికార్జున హిల్స్, అవెన్యూ హోమ్స్, మారుతీనగర్, ఈస్ట్ మారుతీనగర్, రాజిరెడ్డి కాలనీ, ఎస్ వీ కాలనీ, వినాయక్ నగర్, బాలాజీనగర్, శ్రీరామ హిల్స్, వివేకానంద నగర్ కాలనీ, రాగల ఎన్​క్లేవ్, పద్మావతి నగర్, కమలానగర్, సీఆర్ ఎన్ క్లేవ్, బ్యాంక్ కాలనీ, కాస్మోపోలిటన్ కాలనీ, హయత్ నగర్ మండలంలోని సమనగర్ కాలనీ, సీబీఐ కాలనీ, విజయనగర్, సాగర్ కాంప్లెక్స్, సిరిపురం కాలనీ, వైదేహి కాలనీ, బీఎన్​రెడ్డి నగర్, శ్రీరాంనగర్ కాలనీ, ఎస్ కేడీ నగర్, ఉప్పల్, నాగోలులోని సాయినగర్ కాలనీ, కోఆపరేటివ్ బ్యాంక్ కాలనీ, జైపూర్ కాలనీ, అరుణోదయ నగర్ కాలనీ, గణేశ్​నగర్ కాలనీ, లలితా నగర్ నార్త్ కాలనీ, ఈశ్వరిపురి కాలనీ, మేడ్చల్ నియోజకవర్గం మేడిపల్లిలోని సాయిప్రియ నగర్, సత్యనారాయణపురం కాలనీ, రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అత్తాపూర్ సిక్​చవాణి, కార్వాన్, నాంపల్లి, జూబ్లీహిల్స్​నియోజకవర్గాల్లోని ఎక్స్​ మిలిటరీ క్వార్టర్స్​ఉన్నాయి. ఇందులో భాగంగా గోల్కొండలోని బంజారా దర్వాజ, నాంపల్లిలోని బ్యాండ్ లైన్స్, షేక్ పేటలోని మహ్మది లైన్స్, ఆసీఫ్​నగర్ లోని మాసబ్ లైన్స్, ఏసీ గార్డ్స్ లోని నిషేధిత భూములకు పట్టాలు అందనున్నాయి. 

పెరగనున్న భూముల రేట్లు..

15 ఏండ్లుగా నిషేధిత జాబితాలో ఉన్న భూములకు పట్టాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో సదరు భూములకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మొన్నటి వరకు వీటిని కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. పట్టాలు వస్తే సిటీలో ఉన్న రేట్లకు అమ్మకాలు జరిగే అవకాశం ఉంది. అయితే జీవోలోని కొన్ని కాలనీల్లో లబ్ధిదారులు లేకుండానే ఆ ప్రాంతాల్లో పట్టాలు అందించే అవకాశం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు పెద్దల కోసమే మేడిపల్లిలోని సత్యనారాయణపురం కాలనీని చేర్చారనే ప్రచారం జరుగుతోంది. గతంలో  ఇక్కడ ఉన్న సీలింగ్ ల్యాండ్ ని కాపాడాలని అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఇప్పుడు అదే భూములను రెగ్యులరైజ్ చేస్తామని జీవోలో చెప్పడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చుట్టుపక్కల వారు కోరుతున్నారు.

అప్లయ్ చేశాకే వెరిఫికేషన్

118 జీవో ప్రకారం నిషేధిత జాబితాలో ఉన్న వెయ్యి చదరపు గజాలలోపు భూములకు పట్టాలు అందనున్నాయి. ఇందుకుగాను ఒక్కో చదరపు గజానికి రూ.250 చెల్లించాల్సి ఉంది. ఇలా ఆరు నెలల్లోపు నాలుగు విడతలుగా చెల్లించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. దరఖాస్తులు చేసుకున్న తరువాత రెవెన్యూ అధికారులు వెరిఫికేషన్ చేసి అంతా క్లియర్ ఉంటే లబ్ధిదారులకు పట్టాలు ఇస్తారు. ఆ తరువాత రిజిస్ట్రేషన్ చేసునేందుకు వారికి హక్కు ఉంటుంది.