బీసీసీఐ దేన్నయినా తట్టుకుంటుంది: గంగూలీ

బీసీసీఐ దేన్నయినా తట్టుకుంటుంది: గంగూలీ

న్యూఢిల్లీ: ఐపీఎల్‌కు టైటిల్ స్పాన్సర్‌‌షిప్‌గా ఉన్న చైనా కంపెనీ వివో ఆ ఒప్పందం నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. దీని వల్ల బోర్డు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతుందని అంటున్నారు. వీటిని బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ తోసిపుచ్చారు. ఐపీఎల్ కమర్షియల్ రెవెన్యూలో టైటిల్ స్పాన్సర్‌షిప్‌ కీలక భాగం. ఇందులో నుంచి రెవెన్యూను ఎనిమిది ఫ్రాంచైజీలు సమానంగా పంచుకుంటాయి. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌‌షిప్‌ రైట్స్‌ను 2018–2022 వరకు ఐదేళ్లకు గాను వివో దక్కించుకుంది. దీని విలువ రూ.2,190 కోట్లు. సుమారుగా ఏడాదికి రూ.440 కోట్లుగా చెప్పొచ్చు.

‘దీన్ని ఆర్థిక సంక్షోభమని చెప్పలేం. ఇదో తాత్కాలిక సమస్య మాత్రమే. బీసీసీఐ అనేది ఓ బలమైన వ్యవస్థ. ఆట, ఆటగాళ్లు, పరిపాలన విభాగం అందరూ కలిసి ఈ గేమ్‌ను, బీసీసీఐని దేన్నయినా తట్టుకునే సామర్థ్యాన్ని ఇచ్చాయి. మీరు వేరే ఆప్షన్స్‌ను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. ప్లాన్‌ ఏ, ప్లాన్ బీలు ఉండాలి. తెలివైన వ్యక్తులు ఇలానే చేస్తారు. సున్నితమైన బ్రాండ్స్‌, కార్పొరేట్స్ కూడా ఇలానే వ్యవహరిస్తారు. కాలం గడుస్తున్న కొద్దీ ప్రొఫెనల్‌గా బలంగా తయారవడంతోనే ఇది సాధ్యమవుతుంది. పెద్ద విషయాలు ఒక్క రాత్రితోనే జరగవు. అలాగే పెద్ద విషయాలు ఒక్క రోజులోనే దూరంగా వెళ్లిపోవు. సుదీర్ఘ కాలం పాటు మీరు సన్నద్ధమైతే అవి మిమ్మల్ని విజయాలు, ఓటములకు సంసిద్ధం చేస్తాయి. ఇండియా 2021, 2023లో రెండు వరల్డ్‌కప్స్‌కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ నేపథ్యంలో దీంట్లో పెద్ద మార్పులేం లేవు. అవును, కరోనా అందర్నీ అలర్ట్‌ చేసింది, కానీ అది దానిలాగే ఉంది’ అని గంగూలీ చెప్పాడు.