తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి అధికారం సులువు కాదు: బీజేపీ ఎంపీ జీవీఎల్

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి అధికారం సులువు కాదు: బీజేపీ ఎంపీ జీవీఎల్
  • ప్రజలకు దగ్గరయ్యేందుకు నేతల కృషి
  • వారు మార్పు కోరుకుంటే అధికారం సాద్యం

బీజేపీ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు అన్ని ఎన్నికల్లో తమనే గెలిపిస్తున్నారని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. మహారాష్ట్ర, హర్యానాల్లో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారాయన. ఆ రెండు రాష్ట్రాల్లో తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని, అక్కడ ప్రజలంతా బీజేపీ వైపే ఉన్నారని చెప్పారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రావాలని తాము ప్రయత్నిస్తున్నామన్నారు జీవీఎల్. అయితే ఇక్కడ బీజేపీ అధికారంలోకి రావడం అంత సులువు కాదన్నారు. ప్రజలకు దగ్గరవ్వాలన్న లక్ష్యంతో తమ పార్టీ నేతలంతా ఎంతో కృషి చేస్తున్నారని, వారు మార్పు కోరుకుంటే అధికారంలోకి రావడం కష్టం కాదన్నారు.

తాను ఢిల్లీలో ఉన్నా.. ఆంద్రప్రదేశ్ అభివృద్ధి కోసం కృషి చేస్తూనే ఉంటానని చెప్పారు జీవీఎల్. రాబోయే పార్లమెంట్ సమావేశాలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. అనంతపురం కరువు సమస్యను పార్లమెంట్ లో ప్రస్తావిస్తానని చెప్పారు.

ఆర్టికల్ 370 రద్దును ఎవరూ ఊహించలేదని, ధైర్యంగా ప్రధాని మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు జీవీఎల్ నరసింహారావు. దీనిని అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించాలని కొన్ని దేశాలు ప్రయత్నం చేశాయని, అవేవీ ఫలించలేదని అన్నారు.