కళ్యాణి: రంజీ ట్రోఫీలో తొలిసారి ఫైనల్ చేరి కొత్త చరిత్ర సృష్టించేందుకు జమ్మూ కాశ్మీర్ చేరువైంది. సెమీ ఫైనల్లో బెంగాల్ నిర్దేశించిన 126 రన్స్‌ను ఛేదించేందుకు మంగళవారం మూడో రోజు బరిలోకి దిగిన జమ్మూ కాశ్మీర్ ఆట చివరకు రెండో ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లలో 43/2 స్కోరు చేసింది.
శుభమ్ పుండిర్ (23 బ్యాటింగ్), వన్షజ్ శర్మ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. జమ్మూ విజయానికి 83 రన్స్ కావాలి. అంతకుముందు 198/5 ఓవర్ నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన జమ్మూ తొలి ఇన్నింగ్స్‌లో 76.1 ఓవర్లలో 302 రన్స్‌కు ఆలౌటైంది. చివర్లో పేసర్ ఆకిబ్ నబీ (42), యుధ్వీర్ సింగ్ (33) రాణించారు.
బెంగాల్ బౌలర్లలో మహ్మద్ షమీ 8, ముకేశ్ కుమార్ 2 వికెట్లు తీసినా స్కోరును అడ్డుకోలేకపోయారు. తర్వాత బెంగాల్ రెండో ఇన్నింగ్స్‌లో 25.1 ఓవర్లలో 99 రన్స్‌కే కుప్పకూలింది. ఫలితంగా జమ్మూ ముందు 126 రన్స్ టార్గెట్‌ను మాత్రమే ఉంచింది. నబీ, సునీల్ చెరో 4 వికెట్లు తీశారు.
ఉత్తరాఖండ్ 149/5
కర్నాటకతో జరుగుతున్న మరో సెమీస్‌లో ఉత్తరాఖండ్ బ్యాటింగ్‌లో తడబడింది. లక్ష్య రాయ్‌చందని (52 బ్యాటింగ్) మాత్రమే రాణించడంతో మూడో రోజు చివరకు తొలి ఇన్నింగ్స్‌లో 69 ఓవర్లలో 149/5 స్కోరు చేసింది. అంతకుముందు 689/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన కర్నాటక తొలి ఇన్నింగ్స్‌లో 736 రన్స్‌కు ఆలౌటైంది. రవిచంద్రన్ స్మరన్ (135) సెంచరీతో మెరిశాడు.
