
వాషింగ్టన్: రష్యాతో యుద్ధాన్ని ముగించడం ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్ స్కీ చేతుల్లోనే ఉందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ‘‘జెలెన్ స్కీ కోరుకుంటే వెంటనే యుద్ధాన్ని ఆపొచ్చు. లేదంటే పోరాటం కొనసాగించొచ్చు. ఇదంతా ఎలా మొదలైందో ఆయన గుర్తు చేసుకోవాలి. 12 ఏండ్ల క్రితం ఒక్క బుల్లెట్ కూడా పేలకుండానే రష్యాకు అప్పటి అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఇప్పించిన ఉక్రెయిన్ భూభాగం క్రీమియాను తిరిగి అడగొద్దు. అలాగే నాటోలో చేరే ప్రయత్నాలను ఉక్రెయిన్ విరమించుకోవాలి. కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు” అంటూ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
రష్యా అంశంపై బిగ్ ప్రోగ్రెస్ ఉందని, వేచి చూడాలని ఆయన ప్రకటించారు. అయితే, ఉక్రెయిన్ లోని డాన్ బాస్ (డోనెట్స్క్, లుహాన్స్క్) ప్రాంతాన్ని వదులుకోవాలని, క్రీమియాను అడగొద్దని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ డిమాండ్ చేస్తున్నారని.. ఇదే విషయాన్ని జెలెన్ స్కీకి ట్రంప్ చెప్తే అంగీకరించలేదని వార్తలు వచ్చాయి. తాజాగా సోమవారం జెలెన్ స్కీతో భేటీకి ముందు ఆయనపై ఒత్తిడి పెంచేలా ట్రంప్ పోస్ట్ పెట్టడం ఆసక్తికరంగా మారింది.
ఉక్రెయిన్ కు నాటో తరహా భద్రతా హామీ..
ఉక్రెయిన్, ఇతర యూరప్ దేశాలపై భవిష్యత్తులో రష్యా దాడి చేయకుండా, ఆయా దేశాల భూభాగాలను ఆక్రమించకుండా ఉండేలా హామీ ఇచ్చేందుకు పుతిన్ ఒప్పుకున్నారని ట్రంప్ స్పెషల్ ఎన్వాయ్ స్టీవ్ విట్కాఫ్ వెల్లడించారు. నాటో చట్టంలోని ఆర్టికల్ 5 ప్రకారం.. కూటమి దేశాల్లో ఏ దేశంపై దాడి జరిగినా, దానిని అన్ని దేశాలపై దాడిగానే పరిగణిస్తారు. ఇప్పుడు ఉక్రెయిన్ ను నాటోలో చేర్చుకోకపోయినా, ఆర్టికల్ 5 తరహా సెక్యూరిటీ గ్యారంటీని ఇచ్చేందుకు అలస్కా భేటీలో పుతిన్ అంగీకరించారని విట్కాఫ్ తెలిపారు.