
2009 తర్వాతనే తెలంగాణ ఉద్యమం విశాలమైన ప్రజా ఉద్యమంగా మారింది. కేసీఆర్ దీక్ష ఉద్యమం తీవ్రతరం కావటానికి ఉత్ప్రేరకంగా పనిచేసింది. అయితే ఉద్యమ రూపం మాత్రం విద్యార్థుల ఆందోళనల స్ఫూర్తితోనే ఉనికిలోకి వచ్చింది. ఎక్కడికక్కడ జేఏసీలుగా ఏర్పడి ప్రజ లు రోడ్డెక్కారు. ర్యాలీలు, దీక్షలతో తెలంగాణ దద్దరిల్లింది. మరోవైపు విద్యార్థులు చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఒకవైపు కేసీఆర్ దీక్ష.. ఇంకోవైపు నానాటికి తీవ్రమవుతున్న ఆందోళనలను చూసి ఢిల్లీ ప్రభుత్వం తెలం గాణ ప్రకటించింది. తెలంగాణ డిమాండ్ పరి ష్కారానికి ఆ విధంగా రాజకీయ ప్రక్రియ ప్రారంభమైంది.
అటు తరువాత ఆంధ్రా పాలకులు ఢిల్లీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ ప్రకటనను నిలువరించారు. ఆ నేపథ్యంలో తెలంగాణ జేఏసీ (తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ) ఏర్పడింది. జేఏసీ ఏర్పడిన తర్వాత పార్టీలు, ప్రజా సంఘాలు ఒక్కతాటి మీదికొచ్చాయి. ఎవరికివారు తమకు తోచిన పద్ధతుల్లో ఉద్యమకారులు నిర్వహిస్తున్న ఆందోళనల మధ్య కూడా సమన్వయం ఏర్పడింది. నిర్ణయం జేఏసీ విస్తృతస్థాయి స్టీరింగ్ కమిటీ లో జరిగినా ఆ నిర్ణయాల అమలులో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడిన జేఏసీలు స్వతంత్రంగా వ్యవహరించాయి. ఈ ప్రత్యేకత వల్లనే ఉద్యమంలో ప్రజల భాగస్వామ్యం బాగా పెరిగింది. స్థానిక నాయకత్వం సృజనాత్మకంగా ఉద్యమాన్ని నడిపింది. జేఏసీ స్టీరింగ్ కమిటీ మీద మిలియన్ మార్చ్ దాకా ప్రజలకు నమ్మకం కుదరలేదు.
మిలియన్ మార్చ్ తర్వాత జేఏసీ నిజాయితీగా పోరాటం చేస్తున్నదన్న విశ్వాసం వాళ్లలో ఏర్పడింది. మిలియన్ మార్చ్ తర్వాత సకల జనుల సమ్మె, సాగరహారం, సడక్ బంద్, సంసద్ యాత్ర నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. సహాయ నిరాకరణ ఉద్యమంతో ప్రారంభమై అనునిత్యం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉద్యమాన్ని జేఏసీ సజీవంగా ఉంచింది. కేంద్రంపై అనేక రూపాల్లో ఒత్తిడి పెంచింది. రాష్ట్రంలో ని వివిధ పార్టీలకు చెందిన నాయకుల్లో చాలామందిని తెలంగాణకు అనుకూలంగా ఒక తాటి మీదికి తీసుకురాగలిగింది. అప్పటికీ ఇంకా కొంతమంది ఆంధ్ర పాలకులకు ఊడిగం చేస్తూ మిగిలి ఉన్నారు. ఈ నాయకులు ఉద్యమకారులపైన దాడులకు దిగారు. కొసమెరుపు ఏమిటంటే వీరే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని మంత్రివర్గంలో ఉన్నారు.
జేఏసీ ఆధిపత్యంలో నిర్వహించిన పోరాటాల వల్లనే తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని పొందింది. అప్పటి వరకు ఆంధ్ర నాయకులకు తెలంగాణలో ఉన్న ప్రజా పునాది చెదిరిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలోని రెండు ప్రాంతాలు సామాజికంగా, రాజకీయంగా విడిపోయాయి. చట్టపరమైన విభజన మాత్రమే మిగిలింది. ఆ విభజన అనివార్యమైంది. ఉమ్మడి రాష్ట్రం అనే ప్రయోగం విఫలమైందని, రాష్ట్ర విభజన ఇక తప్పనిసరిగా జరగాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించటంతో 2014 సంవత్సరంలో రాష్ట్రం విడిపోయింది. ఆ విధంగా ప్రజా పోరాటాల ఫలితంగా, అనేకమంది ప్రజల త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.