మాలలు అంటే అంత చిన్న చూపా? : జేఏసీ చైర్మన్ రాంచందర్

మాలలు అంటే అంత చిన్న చూపా? : జేఏసీ చైర్మన్ రాంచందర్

బషీర్‌‌‌‌బాగ్, వెలుగు: కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఎందుకు నిర్వహించలేదని మాల సంఘాల జేఏసీ చైర్మన్  చెరుకు రాంచందర్ ప్రశ్నించారు. మాలలు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిన్న చూపు అని మండిపడ్డారు. మలిదశ ఉద్యమంలో తన పాటలతో ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపిన సాయిచంద్‌‌కు సరైన గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సైఫాబాద్‌‌లోని జేఏసీ కార్యాలయంలో 33 జిల్లాల నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాలల సమస్యలు పరిష్కరించడంతో పాటు అన్ని పార్టీలు రాజకీయంగా తమకు ప్రాధాన్యత కల్పించాలని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో మాలల సత్తా చూపిస్తామని హెచ్చరించారు. దళితబంధు రెండో విడతలో మాలలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. హౌసింగ్ గృహలక్ష్మి పథకం ద్వారా ఇచ్చే ఆర్థిక సాయంలో మాలలకు ప్రాధాన్యతనిచ్చి, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్‌‌ చేశారు.

ఈ నెల 5న చలో నల్గొండ పేరుతో దేవరకొండలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నామని తెలిపారు. నామినేటెడ్ పోస్టుల్లో కూడా మాలలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మాలల భవనం కోసం హైదరాబాద్‌‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లేదా గచ్చిబౌలిలో ఐదెకరాల భూమిని కేటాయించి, రూ.10 కోట్లతో వాటిని నిర్మించాలని కోరారు. భాగ్యరెడ్డి వర్మ కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్‌‌లో ఏర్పాటు చేయాలన్నారు. లోయర్ ట్యాంక్ అంబేద్కర్ భవన పునర్నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.