ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

బూర్గంపహాడ్,వెలుగు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తీవ్రంగా నష్టపోతున్న బూర్గంపహాడ్ గ్రామానికి కరకట్ట నిర్మాణంతో పాటు పునరావాస ప్యాకేజీని అందించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ ముంపునకు గురవుతున్న గోదావరి పరివాహక ప్రాంతాల్లో 120 కిలోమీటర్ల మేర కరకట్టలు నిర్మించనున్నట్లు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుతో భవిష్యత్తులో బూర్గంపహాడ్ గ్రామానికి తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. 2013 పునరావాస చట్టం ప్రకారం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేసుపాక వెంకటరమణ, డాక్టర్ విష్ణువర్ధన్, దామెర శ్రీను, హరిప్రసాద్, లక్ష్మణ్, రాయల వెంకటేశ్వర్లు, గూడూరు వెంకన్న, ప్రభాకర్, ఎస్కే ఆరిఫ్  పాల్గొన్నారు.

కాలనీ ఖాళీ చేయం సబ్​కలెక్టర్​ ఆఫీస్​ ముట్టడి
భద్రాచలం, వెలుగు: కాంప్లెక్స్​ నిర్మాణం చేపట్టి వరద బాధితులను తరలించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం సుభాష్​నగర్​ కాలనీ వరద బాధితులు ర్యాలీ నిర్వహించి సబ్​ కలెక్టర్​ ఆఫీసును ముట్టడించారు. కాలనీ ఖాళీ చేయం, కరకట్ట ఎత్తు పెంచాలి.. కరకట్టను పొడిగించాలంటూ నినాదాలు చేశారు. తమను బలవంతంగా వెళ్లగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఖాళీ చేయించాలనుకుంటే 2013 భూ సేకరణ చట్టం ప్రకారం వ్యక్తిగతంగా స్థలం కేటాయించి, ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ఇదిలాఉంటే వరద బాధితులకు డబుల్​బెడ్రూమ్​ ఇండ్లు నిర్మించేందుకు కొత్త మార్కెట్​ స్థలాన్ని ప్రభుత్వం తీసుకోకుండా చూడాలని కోరుతూ వ్యాపారులు ఎమ్మెల్యే పొదెం వీరయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. ఉన్నతాధికారుల దృష్టికి ఈ సమస్య తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

కరకట్ట ఎత్తు, పొడిగింపే పరిష్కారం
కరకట్టల ఎత్తు, పొడిగింపే భద్రాచలం పరిరక్షణకు శాశ్వత పరిష్కారమని సీపీఎం పొలిట్​బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. సీపీఎం డివిజన్​ కార్యాలయంలో ఆయన పార్టీ లీడర్లతో మాట్లాడారు. సర్వేల పేరుతో వరద బాధితులను గందరగోళానికి గురిచేయొద్దని ఆఫీసర్లను కోరారు. సుభాష్​నగర్, అయ్యప్ప, ఏఎంసీ, అశోక్​నగర్​ కొత్తకాలనీ,శాంతినగర్​, చప్టా దిగువ, రామాలయం ఏరియాల్లో బాధితులను పోలవరం ముంపు నుంచి కాపాడాలన్నారు. మాజీ ఎంపీ డా.మిడియం బాబూరావు, మచ్చా వెంకటేశ్వర్లు, ఎంబీ నర్సారెడ్డి, మర్లపాటి రేణుక పాల్గొన్నారు.

డైలీ మార్కెట్ ఫీజు​పేరుతో దందా
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం పట్టణంలో డైలీ మార్కెట్​ పేర కాంట్రాక్టర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్నారని చిరు వ్యాపారులు వాపోతున్నారు. బతుకమ్మ పూలు అమ్ముకునే వారి నుంచి మున్సిపాలిటీ ఫీజ్​ పేరుతో డైలీ మార్కెట్​ కాంట్రాక్టర్లు బలవంతంగా వసూలు  చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో పూల కుప్పకు రూ.25 చొప్పున వసూలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పలువురు అధికార పార్టీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు పట్టణంలో తిరిగే లోకల్​ వెహికల్స్​కు మార్కెట్​ ఫీజు ఉండదని చెబుతుండగా, రూ. 200 చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గట్టిగా అడిగితే మాది చైర్​పర్సన్​ వర్గమని, ఇందులో ఆమెకు కూడా వాటా ఉందని కాంట్రాక్టర్లు చెప్పడం విశేషం. ఈ విషయమై మున్సిపల్​ కమిషనర్​​ నవీన్​ కుమార్ ను వివరణ కోరగా,​నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. డైలీ మార్కెట్​ కాంట్రాక్టర్​ శ్రీరాములు మాత్రం తాము నిబంధనల ప్రకారమే వసూలు చేస్తున్నామని చెప్పారు.

గంజాయి పట్టివేత
భద్రాచలం,వెలుగు: పట్టణ​ పోలీసులు సోమవారం రూ.15 లక్షల విలువ చేసే 77 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు ఏఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. గోదావరి వంతెన సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో  తరలిస్తున్న77 కిలోల గంజాయి పట్టుబడినట్లు చెప్పారు. మహబూబ్​బాద్​ జిల్లా మరిపెడ బంగ్లాకు చెందిన బానోతు హరి, గుండె పరశురాం ఏపీలోని సీలేరులో రాము వద్ద గంజాయి కొనుగోలు చేసి తమ గ్రామంలోని పాండు నాయక్, హైదరాబాదులోని ప్రకాశ్​లకు అమ్ముతున్నట్లు వివరించారు. కారు, మోటారు సైకిల్, రెండు సెల్​ఫోన్లు​స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. సీఐ నాగరాజురెడ్డి, ఎస్సై మధుప్రసాద్​లను ఆయన అభినందించారు.

బాలికపై అత్యాచారం
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: లక్ష్మీదేవి పల్లి మండలంలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం ఘటన గురించి ఆలస్యంగా తెలిసింది.  మండలంలో కిరాణా షాప్ నడుపుతున్న 40 ఏళ్ల వ్యక్తి నిత్యావసర సరుకుల కోసం తరచూ షాపుకు వచ్చే బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక కుటుంబసభ్యులకు తెలపడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ధరణి దరఖాస్తులు పరిష్కరించాలి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ధరణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్​ అనుదీప్​ ఆదేశించారు. కలెక్టరేట్​లో వివిధ శాఖల అధికారులతో సోమవారం రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి సమస్యల పరిష్కారానికి సంబంధించిన నివేదికలను సెక్షన్ల వారీగా అందజేయాలన్నారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకుల, మోడల్​ స్కూల్స్, కేజీబీవీ, గిరిజన, హాస్టల్స్​లో ఫుడ్​ పాయిజన్​ జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వంట మనుషులు, డిప్యూటీ వార్డెన్లు, స్టాఫ్​ నర్సులు, ప్రిన్సిపాల్స్​కు ట్రైనింగ్​ ఇవ్వనున్నట్లు తెలిపారు. డీఆర్వో అశోక్​ చక్రవర్తి, డీఈవో సోమశేఖర శర్మ, వెల్ఫేర్​ ఆఫీసర్​ వరలక్ష్మి పాల్గొన్నారు. 

శివసత్తుల ఆందోళన..
ధూపదీప నైవేద్యంలో భాగంగా తమకు గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ శివసత్తులు కలెక్టరేట్​ ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం గ్రీవెన్స్​లో కలెక్టర్​కు వినతిపత్రాన్ని ఇచ్చారు. కలెక్టరేట్​లో కలెక్టర్​ అనుదీప్​ గ్రీవెన్స్​ సందర్భంగా దరఖాస్తులు స్వీకరించారు.

సర్వే త్వరగా కంప్లీట్ చేయాలి
ఖమ్మం టౌన్: 59 జీవో కింద వచ్చిన దరఖాస్తులపై సర్వే త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్  వీపీ గౌతమ్  ఆదేశించారు. కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి స్పెషల్​ ఆఫీసర్లు, తహసీల్దార్లతో 59 జీవో అమలు, ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై రివ్యూ చేశారు. పెండింగ్ దరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలని సూచించారు. అడిషనల్​ కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్  మధుసూదన్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, ఆర్డీవో రవీంద్రనాథ్ పాల్గొన్నారు. అనంతరం సిటీలోని జగ్జీవన్ రామ్  కాలనీ, శ్రీరాంగిరి కాలనీ, రాఘవయ్యనగర్, శ్రీరామచంద్రనగర్, కొత్తగూడెం కాలనీల్లో పర్యటించి సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. 

సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి
ప్రజావాణిలో వచ్చే అర్జీలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్  వీపీ గౌతమ్  చెప్పారు. జడ్పీ సమావేశ మందిరంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వాటిని పరిష్కరించాలని సంబంధిత ఆఫీసర్లను 
ఆదేశించారు. 

హాస్పిటల్స్​ సీజ్
ఇల్లందు, వెలుగు: పట్టణంలోని హాస్పిటల్స్​లో  సోమవారం తనిఖీలు చేసి సరైన పత్రాలు లేని రవి హాస్పిటల్, శ్రీ సాయి క్లినిక్​లను సీజ్ చేసినట్లు వైద్యాధికారి సంధ్య తెలిపారు. న్యూ లైఫ్  హాస్పిటల్​కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ప్రోగ్రాం ఆఫీసర్​ డాక్టర్ చేతన్, ఎపిడిమిమాలాజిస్ట్ ఇమ్మానుయేల్, రాంప్రసాద్, భద్రు 
పాల్గొన్నారు.

అశ్వారావుపేట/దమ్మపేట: అశ్వారావుపేట టౌన్ లో హాస్పిటల్స్, ల్యాబ్​లను తనిఖీ చేసి​3 హాస్పిటల్స్, 2 ల్యాబ్ లకు షోకాజ్​ నోటీసులు జారీ చేసినట్లు డీఐవో డాక్టర్ నాగేంద్రప్రసాద్  తెలిపారు. నోటీసులకు ఆరు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం దమ్మపేట మండలంలోని హాస్పిటళ్లు, ల్యాబ్​లను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. సీహెచ్​వో నాగభూషణం, హెచ్ఈవోలు రమణారెడ్డి, వెంకటేశ్వర్లు ఉన్నారు. 

భద్రాద్రిలో శరన్నవరాత్రి ఉత్సవాలు షురూ
భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో సోమవారం నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ముందుగా లక్ష్మీతాయారు అమ్మవారి మూలవరులకు పంచామృతాలతో అభిషేకం చేసి, సమస్త నదీజలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీసీతారామచంద్రస్వామి, లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామి తదితర దేవతామూర్తులకు ముత్యాలు పొదిగిన వస్త్రాలు అలంకరించి ముత్తంగి సేవను చేశారు. తర్వాత ప్రాకార మండపంలో శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణమూర్తులకు నిత్య కల్యాణం జరిగింది. లక్ష్మీతాయారు అమ్మవారి ఉత్సవమూర్తిని ఆదిలక్ష్మీ అలంకారం చేసి ప్రత్యేక పూజలు చేశారు. అష్టోత్తర లక్ష్మీ పూజలు, సహస్రనామార్చనలు తర్వాత హారతులు ఇచ్చారు. విశేష లక్ష కుంకుమార్చన జరిగింది. విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. చిత్రకూట మండపంలో శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 108 మంది శ్రీమద్రామాయణ పారాయణం చేశారు. ఈవో శివాజీ దంపతులు ఈ పారాయణాన్ని ప్రారంభించారు. శ్రీసీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా చిత్రకూట మండపానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత రామాయణ పారాయణం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పెద్దమ్మ తల్లి ఆలయంలో..
పాల్వంచ: దుర్గాదేవి శరన్నవరాత్రులను పురస్క రించుకొని మండలంలోని కేశవాపురం, జగన్నాథపురం పెద్దమ్మతల్లి ఆలయంలో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చారు. కొత్త గూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు దంపతులు, హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్  ప్రత్యేక పూజలు చేశారు.

రెండో రోజూ బతుకమ్మ వేడుకలు
ఖమ్మం, వెలుగు: బతుకమ్మ వేడుకల్లో భాగంగా అటుకుల బతుకమ్మ సందర్భంగా సిటీలోని10వ డివిజన్  పర్ణశాలలో మహిళలు పెద్ద ఎత్తున హాజరై సంబరాలు చేసుకున్నారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పించారు.

ఐలమ్మకు ఘన నివాళి
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం నిర్వహించారు. ఐలమ్మ ఫొటోలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహిళల చైతన్యానికి, ఆత్మ గౌరవానికి ఆమె ప్రతీకగా నిలిచారని కొనియాడారు. 
-వెలుగు, నెట్​వర్క్