
న్యూఢిల్లీ: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సంస్కృత విద్వాంసుడు, కవి, రచయిత జగద్గురు రామభద్రాచార్య జ్ఞానపీఠ్ అవార్డును అందుకున్నారు. శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డును ప్రదానం చేశారు. జగద్గురు రామభద్రాచార్యతోపాటు ప్రముఖ ఉర్దూ కవి, పాటల రచయిత గుల్జార్ కు సాహిత్య రంగంలో చేసిన విశేష సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 58వ జ్ఞానపీఠ్(2023) అవార్డును గతంలో ప్రకటించింది.
తాజాగా రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అవార్డును అందజేసింది. అయితే, వృద్ధాప్య సంబంధమైన అనారోగ్యం కారణంగా గుల్జార్ (90) ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. కాగా, జగద్గురు రామభద్రాచార్య(75) అసలు పేరు గిరిధర్ మిశ్రా. ఆయన 1950లో యూపీలోని జౌన్ పూర్ జిల్లా శచీపురంలో జన్మించారు. 1988లో జగద్గురు రామనందాచార్య స్వామి రామభద్రాచార్యగా మారారు. మధ్యప్రదేశ్ లోని చిత్రకూట్ లో ఈయన తులసీదాస్ పేరిట తులసీ పీఠాన్ని స్థాపించారు. ఇక్కడే జగద్గురు రామభద్రాచార్య హ్యాండిక్యాప్డ్ యూనివర్సిటీని కూడా స్థాపించి, దానికి లైఫ్ లాంగ్ చాన్సలర్ గా కొనసాగుతున్నారు.