శంకరాచార్యులు భారత్ మొదటి అంబాసిడర్

శంకరాచార్యులు భారత్ మొదటి అంబాసిడర్

భారత సమాజంలో 1200 సంవత్సరాలకు పూర్వం.. నెలకొన్న వైరుధ్యాలతో.. ఎవరి మతం వారిదే, ఎవరి అభిమతం వారిదేనన్న అహంకార భావన, శైవ, వైష్ణవ, శాక్త, కాపాలిక మొదలైన వర్గాల మధ్య ఆధిపత్య పోరాటం కారణంగా దేశంలో హిందూ ధర్మంలోని అనాచారాలు ప్రబలాయి. ఈ సమయంలో.. శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు చూపిన మార్గమే మళ్లీ సనాతన ధర్మాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చింది. శంకరాచార్యుల వారు దేశం నలుదిశలా పర్యటిస్తూ ఆత్మ, పరమాత్మ ఒక్కటేనన్న భావనను సమాజంలో  నెలకొల్పుతూ తాను స్థాపించిన వైదిక మార్గాన్ని కంటికి రెప్పలా కాపాడటానికి నాలుగు పీఠాలను (తూర్పున పూరి, దక్షిణంలో శృంగేరి, పశ్చిమాన ద్వారక, ఉత్తరంలో బద్రీనాథ్) స్థాపించి వాటిని ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దారు. మనమంతా ఒక్కటే అన్న భావన ప్రజల్లో కల్పించడంలో శంకరాచార్యులు విజయం సాధించారు. వారి అపారమైన జ్ఞానం, ఉన్నతమైన ఆలోచనలు మన సమాజంపై బలమైన ముద్రను వేశాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వారు చేసిన పాదయాత్రలు, మనమంతా సమానం అనే భావన, భాషలు వేరైనా భావమొక్కటేనన్న ఆలోచనను పెంపొందించాయి. అందుకే శంకరాచార్యుల వారిని ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ ఆలోచనను విశ్వవ్యాపితం చేసిన మొదటి అంబాసిడర్ గా చెప్పుకోవడంలో సందేహం అక్కర్లేదు.

ఆర్టికల్ 370 రద్దు

స్వాతంత్ర్య భారతంలో జమ్మూకాశ్మీర్ ఒక అల్లకల్లోల రాష్ట్రంగా మారింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం మాత్రం భారత్ లో ఉందా? లేదా? అన్న అనుమానాలుండేవి. ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక పతాకం, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం కారణంగా నెలకొన్న అల్లకల్లోలం, దారిమళ్లుతున్న కశ్మీరీ యువత వంటివి.. యావద్దేశాన్ని కలవరపరిచేవి. జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని యావద్భారతంతో అనుసంధానం చేయడమనేది మొదటి నుంచీ బీజేపీ ఆలోచనా విధానం.  పార్టీ వ్యవస్థాపకులు కూడా ఈ దిశగా ఎంతో కృషిచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పగ్గాలు చేపట్టిన తర్వాత.. జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రాన్ని మరీ ముఖ్యంగా కల్లోల కాశ్మీరాన్ని శాంతిబాట పట్టించేందుకు నడుంబిగించారు.  5 ఆగస్టు, 2019 నాడు ఆర్టికల్ 370ని పార్లమెంటు వేదిక ద్వారా రద్దుచేసింది. ఇది భారతదేశ చరిత్రలో ఓ చారిత్రక ఘట్టం. ఆ తర్వాతే భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లుగా అక్కడి ఆడబిడ్డలకు తండ్రి ఆస్తిలో వాటా దక్కడం, పారిశుద్ధ్య కార్మికులకు స్థానిక నివాస హోదా, విద్యాహక్కు, సమాచార హక్కు వంటివన్నీ జమ్మూకాశ్మీర్ లో అమలయ్యాయి. 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత.. జమ్మూ, కాశ్మీర్ ప్రాంతాల్లో ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీలో భాగంగా రూ.60 వేల కోట్ల విలువైన 53 ప్రాజెక్టులు వేగంగా సాగుతున్నాయి. సౌభాగ్య, ఉజ్వల, ఉజాలా, మిషన్ ఇంద్రధనుష్ వంటి దాదాపు 20 వ్యక్తిగత లబ్ధి చేకూర్చే పథకాలు ఆ ప్రాంత ప్రజలకు అందుతున్నాయి. జమ్మూ-కాశ్మీర్, -లద్దాఖ్ ప్రాంతాలను అనుసంధానించేందుకు 14 కిలోమీటర్ల పొడవైన ‘జోజిలా టన్నెల్’ను మోడీ ప్రభుత్వం నిర్మించింది. ఇది ఆసియాలోనే అత్యంత పొడవైన బై-డెరెక్షనల్ టన్నెల్. కరోనానంతర పరిస్థితుల్లోనూ.. రికార్డు స్థాయిలో 1.84 కోట్ల మంది దేశీయ పర్యాటకులు జమ్మూకాశ్మీర్ ను సందర్శించారు.

మావోయిస్టులపై ప్రత్యేక వ్యూహం

దశాబ్దాలుగా అడవుల్లో తిష్టవేసి.. అక్కడున్న ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందకుండా అడ్డుపడుతున్న మావోయిస్టులను ఉక్కుపాదంతో అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. తద్వారా ఈ ప్రాంతాల్లో  అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల లబ్ధిని అందించేందుకు కృషిచేస్తోంది. ఈ దిశగా మోడీ సర్కారు చేస్తున్న కృషి కారణంగా 2010 నాటి  పరిస్థితులతో పోలిస్తే.. 2022లో వామపక్ష తీవ్రవాదం 77 శాతం అంతమైంది. 2010లో మావోయిస్టుల చేతిలో 1005 మంది సామాన్య ప్రజలు, సాయుధ బలగాలు బలవ్వగా.. 2022లో ఈ సంఖ్య 98గా నమోదైంది.  ఇదే సమయంలో గిరిజనులకు కనీస వసతుల కల్పన, సంక్షేమ పథకాలు అందించేందుకు అవసరమైన అనుసంధానత విషయంలోనూ మోడీ ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోంది.

సాంస్కృతిక పునరుజ్జీవనం

సాంస్కృతిక వైవిధ్యతే.. భారతదేశ విశిష్టత. దీన్ని కాపాడుకునేందుకు మోడీ ప్రభుత్వం సాంస్కృతిక పునరేకీకరణకు నడుంబిగించింది. వారణాసిలో కాశీ విశ్వనాథుని సమక్షంలో.. ‘కాశీ-తమిళ్ సంగమం’ కార్యక్రమం ద్వారా రెండు ప్రాంతాల ప్రజల మధ్య ఆత్మీయ అనుబంధానికి బాటలు పడ్డాయి. ఇదే సందర్భంలో.. ప్రధానమంత్రి 13 భారతీయ భాషల్లో  అనువదించిన తిరుక్కురల్ పుస్తకాలను ఆవిష్కరించడం వంటి మహత్తర ఘట్టాలకు ఈ కార్యక్రమం వేదికైంది. ‘సౌరాష్ట్ర- తమిళ్ సంగమం’  ద్వారా సోమనాథ్ తో తమిళనాడులోని  సోమసుందరేశ్వరుడిని అనుసంధానం చేయడం, ఇరు ప్రాంతాల సంస్కృతి మార్పిడికి ఓ వేదికగా మారింది.

ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ లక్ష్యంగా..

2018 నుంచి రామనవమి సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖతో కలిసి ప్రతి ఏటా ‘మాధవ్‌పూర్’ మేళాను (శ్రీకృష్ణ, రుక్మిణిల వివాహం) నిర్వహిస్తోంది. మథుర (యూపీ)లో జన్మించిన కృష్ణుడు, గుజరాత్ ను తన కర్మభూమిగా (ద్వారక) మార్చుకున్నాడు. రుక్మిణి ఈశాన్య ప్రాంతానికి చెందిన యువరాణి. వీరిద్దరి వివాహం భారతదేశంలో భిన్న సంస్కృతుల సమ్మేళనానికి దారితీసిందనేది ఈ మేళా ఉద్దేశం. దీనికితోడు ‘యువ సంగం’ పేరుతో ఈశాన్య భారతంలోని పరిస్థితులను మిగిలిన రాష్ట్రాల్లోని యువత తెలుసుకోవాల్సిన అవసరాన్ని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టింది.   ప్రతి నెలా 16 మంది కేంద్ర మంత్రులు ఈశాన్య రాష్ట్రాలను సందర్శించడం, అక్కడి ప్రజలతో సంభాషించడం, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై వివరాలు తెలుసుకోవడం, సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం ద్వారా.. అక్కడి ప్రజల్లో ఓ భరోసాను కల్పించే కార్యక్రమం జరుగుతోంది. ప్రధాని మోడీ కూడా స్వయంగా 60 కంటే ఎక్కువ సార్లు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించారు. ఈశాన్య రాష్ట్రాలను ఆయన అష్టలక్ష్మిగా సంబోధిస్తూ.. అక్కడ సమగ్రాభివృద్ధికి బాటలు వేశారు. ఇటీవలే కేంద్రం సరిహద్దు గ్రామాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ‘వైబ్రెంట్ విలేజెస్’ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. కేంద్ర మంత్రులం సరిహద్దు గ్రామాల్లో పర్యటించడం ద్వారా అక్కడి ప్రజలకు భరోసా ఇస్తున్నాం. ఇలాంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా.. భారతదేశాన్ని ఒకే తాటిపైకి తీసుకురావడం, ప్రజల్లో మనం అనే భావనను పెంపొందించే లక్ష్యంతో  ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ నినాదంతో శంకారాచార్యుని ‘అద్వైత సిద్ధాంత’ స్ఫూర్తితో నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకెళ్తోంది.

‘అష్టలక్ష్మి’గా ఈశాన్యం!

ఈశాన్య భారతం వ్యూహాత్మకంగా, భౌగోళికంగా చాలా కీలకమైన ప్రాంతం. భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలోనూ ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన పోరాటాలు కీలకపాత్ర పోషించాయి. కానీ కాంగ్రెస్ పాలనలో ఈప్రాంతం పూర్తిగా నిరాదరణకు గురైంది. చైనాతో సరిహద్దు  కారణంగా కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన ఈశాన్య భారతం అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచింది. దీంతో వేర్పాటువాద గ్రూపులు రాజ్యమేలాయి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి.. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేశారు. కానీ మధ్యలో పదేళ్ల పాటు యూపీఏ ప్రభుత్వం తీరు కారణంగా.. మళ్లీ అరాచకం రాజ్యమేలింది. మోడీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈశాన్య రాష్ట్రాలకోసం ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తున్నారు. వివిధ మంత్రిత్వ శాఖలు తమ బడ్జెట్ లో 10శాతం ఈశాన్య రాష్ట్రాల్లో ఖర్చుచేయాలనే నిర్ణయంతోపాటు, అక్కడి ప్రజలతో మిగిలిన భారతదేశానికి భావోద్వేగ బంధాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటివరకు నార్త్ ఈస్ట్ రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం రూ.5లక్షల కోట్లు ఖర్చుచేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో గత 9 ఏళ్లలో రైల్వేశాఖ రూ. 50వేల కోట్లు ఖర్చుచేసి కొత్త రైల్వే లైన్స్, టన్నెల్స్, బ్రిడ్జిలను నిర్మిస్తోంది. ఇవి కాకుండా రూ. 80వేల కోట్ల కొత్త ప్రాజెక్టులను రైల్వే శాఖ మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులో ప్రపంచంలోనే అతి ఎత్తయిన పియర్ బ్రిడ్స్ (141 మీటర్లు) కూడా ఉంది. వేర్పాటువాదులతో శాంతి ఒప్పందాల  ద్వారా వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చారు. దీంతో ఒకప్పుడు ఏకే-47లు పట్టుకుని తిరిగిన యువత నేడు ల్యాప్‍‌టాప్‌లు పట్టుకుంటోంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ నినాదాన్ని  మనసా, వాచా, కర్మణా అమలు చేస్తోందనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.

నరేంద్రుని సంకల్పం

2014లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టే నాటికి దేశంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు, ప్రాంతీయ వాదాలు, తీవ్రవాద గ్రూపులు (కశ్మీర్​లో, ఈశాన్య రాష్ట్రాల్లో), వామపక్ష ఉన్మాదులు (మావోయిస్టులు), అవినీతిపరులు, అక్రమార్కుల దౌర్జన్యాలు ఒకవైపు.. కులాలు, మతాల పేరుతో వేరు కుంపట్లు పెట్టుకుని దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను ప్రశ్నిస్తున్న వర్గాలు మరోవైపు. యూపీఏ హయాం ముగిసే సమయంలో దేశంలో నెలకొన్న అరాచక పరిస్థితుల నుంచి దేశాన్ని ఏకం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పించారు. అందుకే అధికారంలోకి రాగానే ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ నినాదాన్ని ఆచరణలో చూపుతూ దేశాన్ని ఏకం చేసే సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చారు.

- జి.కిషన్ రెడ్డి, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి